ప్రత్యామ్నాయ పంటల సాగు వివరాలు
● తక్కువ నీరు, కాలపరిమితి పంటలు ఎంచుకోండి.. ● అపరాలు, చిరుధాన్యాల సాగుతో లాభం ● విస్తృత అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు
పంటల్లో
రఘునాథపాలెం రైతు వేదికలో విత్తనాలను పరిశీలిస్తున్న కలెక్టర్ దివాకర
ఖమ్మంవ్యవసాయం: జిల్లాపై ఎల్‌నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తుండగా.. లోటు వర్షపాతం నమోదవుతోంది. ఈ నెల ముగిసే సమయం సమీపించినా సరైన వర్షాలు లేక పంటల సాగు ఆశాజనకంగా లేదు. అరకొరగా తప్ప భారీ వర్షాలు లేక భూమిలో పదును, తేమ కోల్పోయి పంటలు ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మేరకు పరిస్థితులను క్షేత్రస్థాయిలో రైతులకు వివరించాలని ప్రభుత్వం, వ్యవసాయ శాఖ, శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో నీటి ఎద్దడిని తట్టుకునే తక్కువ కాల కాలపరిమితితో కూడిన ఆరుతడి పంటలు సాగు చేయాలని విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు.
వరి స్థానంలో..
జిల్లాలో ప్రధాన పంటగా వరి ఉంటుంది. అన్ని పంటలు కలిపి 6,18,412 ఎకరాల్లో సాగైతే ఇందులో వరి దాదాపు 3లక్షల ఎకరాల మేర ఉంటుంది. ఇప్పటివరకు పొడిదుక్కులు, నాటే పద్ధతిలో దాదాపు 70 వేల ఎకరాల వరకు పంట వేశారు. మరో లక్ష ఎకరాలకు వరి నార్లు పోసినా.. ప్రస్తుత తరుణంలో పంటకు సరిపడా నీటి సౌకర్యం లేదు. జిల్లాకు ప్రధాన నీటివనరు అయిన సాగర్ నుంచి సాగు అవసరాలకు నీరు విడుదలయ్యే అవకాశంలేకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలనుచేయాలని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఇక జూన్‌లో కురిసిన వర్షాలతో జిల్లాలో2.30 లక్షల ఎకరాల్లో పత్తి నాటారు. ఈ పంట సైతం ఆశాజనకంగా లేదు. మరోపక్క 30 వేల నుంచి 40 వేల ఎకరాల వరకు పెసర సాగు చేస్తుండగా, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పంట సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
అపరాలు, చిరు ధాన్యాలు
వరికి ప్రత్యామ్నాయంగా అపరాల పంటలైన పెసర, మినుము, కంది పంటలతో పాటు సజ్జ,జొన్న వేరుశనగ వంటి పంటలను వేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. నేలల రకాలు,నీటి వనరుల ఆధారంగా పంటలను ఎంచుకోవాలని చెబుతున్నారు. ఈ సమయాన తక్కువకాలపరిమితి పంటలే పండించాలని సూచిస్తున్నారు. పెసరకు తక్కువ నీటి అవసరంఉండగా, మంచి మార్కెట్ ఉంటుందని వివరిస్తున్నారు. అలాగే, మినుము కరువును తట్టుకునినేల సారాన్ని మెరుగుపరుస్తుందని, కంది తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లోనూ సాగుకు అనుకూలమని చెబుతున్నారు. ఇక సజ్జ ధాన్యంగా, పశువుల మేతగా ఉపయోగపడుతుంది. పోడుప్రాంతాలకు ఈ పంట అనుకూలంగా ఉంటుంది.
వాతావరణ పరిస్థితులు,
నేల రకాల ఆధారంగా..
ప్రత్యామ్నాయ పంటల సాగులో ప్రాంతం, వాతావరణ పరిస్థితులు, మట్టి రకం, నీటి లభ్యత ఆధారంగా ఎంచుకోవాలి. విత్తే సమయంలో మార వచ్చు. అంతేకాక అధిక దిగుబడి కోసం సక్రమంగా యాజమాన్య పద్ధతులను పాటించాలి. సమగ్ర ఎరువుల వినియోగం, కలుపు నియంత్రణ, నీటి నిర్వహణ పద్ధతులను పాటించాల్సి ఉంటుంది. సేంద్రియ పద్ధతులు అనుసరించడం ద్వారా భూసారాన్ని కాపాడుకోవచ్చు.
పంట అనువైన సమయం పంట కాలం కోత సమయం
పెసర జూలై చివరి వరకు 70 – 85 రోజులు ఆగస్టు – నవంబర్
మినుము జూలై చివరి వరకు 80 – 90 రోజులు నవంబర్ నుంచి
సజ్జ జూలై చివరి వరకు 70 – 80 రోజులు సెప్టెంబర్ చివరిలో
జొన్న జూలై చివరి వరకు 80 – 100 రోజులు ఆగస్టు – నవంబర్
వేరుశనగ ఆగస్టు వరకు 110 – 120 రోజులు డిసెంబర్ చివరి వరకు


