ఖమ్మంమయూరిసెంటర్/తిరుమలాయపాలెం: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ఖమ్మంరూరల్ మండలంలోని వివిధ గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనుండగా, మధ్యాహ్నం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి గొల్లగూడెం ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో అదనపు వసతిగృహం, భోజన శాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 4గంటలకు తిరుమలాయపాలెం మండలం తిమ్మక్కపేటలో డాక్టర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మంత్రి, ఆతర్వాత పాపాయిగూడెం, మేడిదపల్లి, జూపెడ గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.
నేడు జిల్ల్లాకు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా
ఖమ్మంమయూరిసెంటర్: జమ్మూ – కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11–30 గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో రానున్న ఆయన ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయ సమీపంలోని నూతన శివాలయంలో జరిగే పూజల్లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం వెలుగుమట్లలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. ఆతర్వాత ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడెంలోని నామ ముత్తయ్య – వరమ్మ స్మృతి వనం వద్ద నివాళులర్పించి హైదరాబాద్ బయలుదేరతారు.
కేసుల పరిష్కారంలో
సమర్థవంతంగా పనిచేయాలి
● పోలీసు కమిషనర్ సునీల్‌దత్
ఖమ్మంక్రైం: నేరాల కట్టడితో పాటు కేసుల పరిష్కారంలో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిబ్బందిమరింత సమర్థవంతంగా పని చేయాలని పోలీసు కమిషనర్ సునీల్‌దత్ సూచించారు. ఖమ్మంలోని సీసీఎస్‌ను మంగళవారం పరిశీలించిన ఆయన చోరీలు, ఇతర కేసుల దర్యాప్తులో అవలంబిస్తున్న విధానం, పాత నేరస్తుల కదలికలపై ఆరా తీశారు. అనంతరం సీపీ మాట్లాడుతూ సీసీఎస్‌ను మరింత పటిష్టపరిచేలా అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. కేసుల పరిష్కారంలో పాటు సొత్తు రికవరీపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఇందుకోసం ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
పిల్లల్లో వికాసానికి కృషి
ఖమ్మంలీగల్: పిల్లలకు చదువుతో పాటు క్రీడలు, పుస్తక పఠనం, చిత్రలేఖనం, సంగీతంపై ఆసక్తి పెంచి వారి సమగ్ర మనో వికాసానికి కృషి చేయాలని జిల్లా న్యాయ సేవా సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) కార్యదర్శి పి.దేవీమానస సూచించారు. ఖమ్మంలోని శిశుగృహను మంగళవారం సందర్శించిన ఆమె పిల్లలకు అందిస్తున్న వసతులను పరిశీలించాక మాట్లాడారు. పిల్లల విద్య, ఆరోగ్యం, ఆహారం, వైద్య సదుపాయాలు, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందికి సూచించారు. అంతేకాక వారిలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, సామాజిక నైపుణ్యాలు పెరిగేలా అనుకూల వాతావరణాన్ని కల్పించాలని తెలిపారు. ఇదేసమయాన ప్రతీ చిన్నారిని సంరక్షిస్తూ వారి హక్కుల పరిరక్షణకు నిబంధనలను అమలు చేయాలని సూచించారు.
తహసీల్‌కు స్థల పరిశీలన
కారేపల్లి: సింగరేణి మండలంలో గృహ నిర్మాణ శాఖ పీడీ శ్రీనివాస్ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నూతన తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి రూ.2.25 కోట్లు మంజూరు చేసిన నేపథ్యాన ప్రతిపాధిత స్థలాన్ని పరిశీలించారు. అనంతరం పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని పరిశీలించిన పీడీ.. ఉద్యోగులకు సూచనలు చేశారు. డీఈఈ జాగ్రం, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీఓ రవీంద్రప్రసాద్, ఏఈఈలు నాగేంద్రబాబు, స్వప్న పాల్గొన్నారు.
జిల్లాపై తుపాన్ ప్రభావం
ఖమ్మంవ్యవసాయం: తుపాను ప్రభావం జిల్లా ను తాకింది. మంగళవారం రాత్రి 8గంటల నుంచి పలుచోట్ల జల్లులు మొదలయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి తోడు నైరుతి రుతుపవనాల కారణంగా మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈక్రమాన మహబూబాబాద్, భద్రాద్రి జిల్లాల్లో ఓ మోస్తరుకు మించి వర్షాలు కురుస్తుండగా, జిల్లాలోనూ తుపాను మొదలైంది. కారేపల్లి, రఘునాథపాలెం, కామేపల్లి, ఏన్కూరు, కూసుమంచి, పెనుబల్లి, సత్తుపల్లి తదితర మండలాల్లో వర్షప్రభావం కనిపించింది.


