సబ్సిడీ కుంభకోణంపై టెస్కాబ్‌ విచారణ | - | Sakshi
Sakshi News home page

సబ్సిడీ కుంభకోణంపై టెస్కాబ్‌ విచారణ

Jul 29 2026 12:58 AM | Updated on Jul 29 2026 12:58 AM

● ఆదేశాలు జారీ చేసిన మంత్రి తుమ్మల ● సర్దుబాటు పనిలో అక్రమార్కులు

● ఆదేశాలు జారీ చేసిన మంత్రి తుమ్మల ● సర్దుబాటు పనిలో అక్రమార్కులు

సత్తుపల్లి: సత్తుపల్లి డీసీసీబీ కేంద్రంగా సబ్సిడీ రుణాల కుంభకోణం వెలుగు చూడడంతో విచారణ చేపట్టాలని టెస్కాబ్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ అంశంపై ‘సాక్షి’లో వరుసగా కథనాలు ప్రచురితమైన విషయం విదితమే. దీంతో రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్‌లో మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్షించి తక్షణం విచారణ చేపట్టాలని ఆదేశించినట్లు సమాచారం. ఈనేపథ్యాన బుధవారం టెస్కాబ్‌ అధికారులు క్షేత్రస్థాయిలో యూనిట్లను పరిశీలించనున్నట్లు తెలిసింది. ఒక్క సత్తుపల్లి డీసీసీబీ పరిధిలోనే 70 వరకు పీఎంఈజీపీ యూనిట్లకు సబ్సిడీ రుణాలు మంజూరు చేసినట్లు సమాచారం.

అంతా బాగుందని నమ్మించేలా...

టెస్కాబ్‌ అధికారులు విచారణకు వస్తున్నారనే సమాచారం బయటకు పొక్కినట్లు తెలిసింది. దీంతో లేని యూనిట్లకు సబ్సిడీ రుణాలు తీసుకున్న పలువురు హడావుడి పడుతూ అంతా బాగుందని నమ్మించే ప్రయత్నాల్లో నిమగ్నమైనట్లు తెలిసింది. ఈమేరకు టెంట్‌ సామాన్లు, వాటర్‌ ప్లాంట్లు, పాడి గేదేలు, వర్మీకం పోస్టు యూనిట్ల పరికరాలను హడావుడిగా ఏర్పాటు చేసి ఫ్లెక్సీలు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాల్లో ఈ తరహా పలువురు రుణాలు తీసుకున్నట్లు తెలుస్తుండగా, ఒక్క సత్తుపల్లిలోనే సుమారు రూ.3కోట్ల మేర సబ్సిడీ రుణాలు ఇచ్చినట్లు తెలిసింది. కాగా, అక్రమాలకు సహకరించిన బ్యాంక్‌ అధికారులు సైతం యూనిట్లు తీసుకున్న వారికి సూచనలు చేసినట్లు సమాచారం. ఈనేపథ్యాన సదాశివుని పాలెంలో ఓ వ్యక్తి మంగళవారం రాత్రి హడావుడిగా వాటర్‌ ప్లాంట్‌ పరికరాలు బిగిస్తుండగా, నారాయణపురంలో మరో వ్యక్తి అద్దెకు టెంట్‌ సామగ్రి తీసుకొచ్చి పెట్టాడని తెలిసింది. ఇక డెయిరీ ఫామ్‌ రుణాలు తీసుకున్న వారు ఇతర రైతుల నుంచి గేదెలను తీసుకొచ్చి షెడ్లలో పెట్టినట్లు సమాచారం.

వెల్‌నెస్‌ సెంటర్‌ ఘటనపై త్రిసభ్య కమిటీ

ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం జనరల్‌ ఆస్పత్రి ఆవరణలోని వెల్‌నెస్‌ సెంటర్‌లో మహిళా వైద్యులు, సిబ్బందిపై చోటు చేసుకున్న వేధింపుల ఘటనకు సంబంధించి విచారణ కోసం త్రిసభ్య కమిటీని నియమిస్తూ అదనపు కలెక్టర్‌ శ్రీజ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. వెల్‌నెస్‌ సెంటర్‌లో మహిళా వైద్యులు, సిబ్బందిపై ఓ వైద్యుడు దురుసుగా ప్రవర్తిస్తూ, వేధింపులకు గురిచేస్తుండగా వారు అదనపు కలెక్టర్‌తో పాటు సూపరింటెండెంట్‌ నరేందర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈవిషయమై మంగళవారం ‘సాక్షి’లో ‘పళ్లతో వెక్కిరింతలు.. చేష్టలతో వేధింపులు’ శీర్షికన ప్రచురితమైన కథనం చర్చనీయాంశంగా మారింది. దీంతో విచారణ కోసం అదనపు కలెక్టర్‌ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ జి.జ్యోతి, జిల్లా సంక్షేమ అధికారి ఏ.ప్రమీల, పెద్దాస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌తో కూడిన ఈ కమిటీ విచారణ చేపట్టిన ఆగస్టు 5వ తేదీన నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement