● పారిశుద్ధ్య వాహనాల ఇంధనం పక్కదారి ● డ్రైవర్‌పై కేసు.. ఓ ఉద్యోగి సస్పెండ్ ● అసిస్టెంట్ కమిషనర్‌పై కూడా చర్యలకు సిఫారసు
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగర పాలక సంస్థ (కేఎంసీ)లో పారిశుద్ధ్య వాహనాలకు సంబంధించి డీజిల్ వినియోగం తీవ్ర వివాదాస్పదమవుతోంది. ఇంధన చోరీని అరికట్టడం, పారదర్శకత కోసం అధికారులు ఎన్నిచర్యలు తీసుకుంటున్నా అక్రమాలకు అడ్డుకట్ట పడడం లేదు. డీజిల్ కూపన్ల జారీలో సిబ్బంది తీరుకు తోడు అధికారుల అలసత్వంతో అక్రమాలు నిత్యకృత్యమయ్యాయి. ఈక్రమాన డీజిల్ కుంభకోణం వెనుక కేఎంసీలోని ఓ ఉన్నతాధికారి హస్తం ఉందనే ప్రచారం చర్చనీయాంశం కాగా.. కమిషనర్ చర్యలకు ఉపక్రమించారు.
ఫోన్ కాల్‌తో పక్కదారి..
కొంతకాలంగా డీజిల్ విభాగంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి కూపన్లు ఇవ్వకుండానే పెట్రోల్ బంక్ నిర్వాహకులకు ఫోన్ చేసి వాహనం నంబర్ చెప్పి ఇంధనం కొట్టాలని సూచించేవాడు. రెండు రోజుల తర్వాత వాహనాల నంబర్లతో కూపన్లు రాసి పంపించేవారని తెలుస్తోంది. ఫలితంగా ఒక వాహనానికి డీజిల్ కొట్టించి, మరో వాహనం పేరిట కూపన్లు సృష్టించి కేఎంసీ సొమ్మును పక్కదారి పట్టించినట్లు సమాచారం. అయితే, గతంలో కేఎంసీ పారిశుద్ధ్య వాహనాలకు రామన్నపేట సబ్‌జైలు వద్ద ఉన్న జైలు బంక్‌లో ఇంధనం కొట్టించగా.. అక్కడ నిబంధనలు కచ్చితంగా అమలయ్యాయి. ఆతర్వాత బైపాస్ రోడ్డు రాపర్తినగర్‌లోని ఒక ప్రైవేట్ బంక్‌కు మార్చాక అక్రమాలు జోరందుకున్నాయి.
డబ్బాల్లో డీజిల్
వాహనాల ట్యాంకుల్లో నింపాల్సిన డీజిల్‌ను డబ్బాల్లో పోస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈనెల 22న స్వీపింగ్ మిషన్‌కు డీజిల్ కొట్టించేందుకు వెళ్లిన ఓ డ్రైవర్ ట్యాంక్‌లో కొంత ఇంధనం పోయించి, మరికొంత డీజిల్ క్యాన్లలో పట్టించినట్లు తెలిసింది. ఈ వ్యవహారం కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య దృష్టికి వెళ్లడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆదేశాలతో శానిటరీ ఇన్‌స్పెక్టర్ పి.శంకర్ ఫిర్యాదు చేయగా ఖమ్మం టూటౌన్ పోలీసులు మంగళవారం ఔట్ సోర్సింగ్ డ్రైవర్ కె.ప్రకాశ్‌పై కేసు నమోదు చేశారు.
ఒకరి సస్పెండ్.. ఏఎంసీపై చర్యకు లేఖ
దందాపై పూర్తిస్థాయిలో విచారణ చేయించిన కమిషనర్.. కూపన్లు పంపకుండా ఫోన్ కాల్‌లో డీజిల్ కొట్టించిన ఉద్యోగి హేమంత్ సాయిని సస్పెండ్ చేశారు. ఇదే సమయాన లోపాలకు బాధ్యుడిగా అసిస్టెంట్ కమిషనర్ అనిల్‌కుమార్‌పైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక ఆయన సస్పెన్షన్‌కు సిఫారసు చేస్తూ ఉన్నతాధికారులకు లేఖ రాసినట్లు తెలిసింది. ఇక డీజిల్ విభాగంలో కూపన్లు రాసే బాధ్యతను సీనియర్ అసిస్టెంట్ సునీల్‌కు అప్పగించినట్లు సమాచారం. కాగా, అక్రమాల్లో అధికారుల పాత్ర ఉన్నా పట్టించుకోకుండా తమను బలిపశువులను చేస్తున్నారని డ్రైవర్లు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు కమిషనర్ పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని వారు కోరుతున్నారు.


