ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత | - | Sakshi
Sakshi News home page

ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత

Jul 29 2026 12:58 AM | Updated on Jul 29 2026 12:58 AM

● ఓపీ నిర్వహణలో ప్రామాణిక విధానాలు ● జనరల్‌ ఆస్పత్రిలో తనిఖీ చేసిన కలెక్టర్‌ దివాకర

● ఓపీ నిర్వహణలో ప్రామాణిక విధానాలు ● జనరల్‌ ఆస్పత్రిలో తనిఖీ చేసిన కలెక్టర్‌ దివాకర

ఖమ్మం వైద్యవిభాగం: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే వారి సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, ఆస్పత్రి నిర్వహణలో సమస్యలకు శాశ్వత పరిష్కారాలు రూపొందించాలని కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. ఆదేశించారు. ఖమ్మం ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో మంగళవారం ఆయన అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజ, ట్రెయినీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ పారస్‌కుమార్‌తో కలిసి వైద్య అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ దివాకర మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ నిర్వహణకు అవసరమైన ప్రామాణిక విధానాలు అమలు చేస్తూ, అవసరమైన మందులు, సామగ్రిని అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఏ ఒక్కరిని మందుల కోసం బయటకు పంపించొద్దని సూచించారు. అంతేకాక పార్కింగ్‌, సీసీ కెమెరాల ఏర్పాటు, ఇతర వసతుల కల్పన త్వరగా పూర్తిచేసి, మెడికల్‌ కళాశాలలో ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్ల ఖాళీలపై నివేదిక సమర్పించాలని తెలిపారు. అంతేకాక ప్రభుత్వ అనుమతి లభించిన పోస్టులను ఔట్‌సోర్సింగ్‌ విధానంలో భర్తీ చేయాలని చెప్పారు. కాగా, వైద్యులు, సిబ్బంది హాజరును బయోమెట్రిక్‌ విధానంలోనే నమోదు చేయాలని స్పష్టం చేశారు. అనంతరం కలెక్టర్‌ ఓపీ విభాగం, వార్డులు, ఐసీయూ, మాతా శిశు ఆరోగ్య కేంద్రంలోని విభాగాలను పరిశీలించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ నరేందర్‌, మెడికల్‌ కాలేజీ పర్యవేక్షకులు రాజేశ్వరరావు, వైద్య శాఖ ఈఈ ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఆరుతడి పంటలకే ప్రాధాన్యత

రఘునాథపాలెం: ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా రైతులు అధిక నీరు అవసరం ఉండే పంటలకు బదులు ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్‌ సూచించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ, ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యాన నిర్వహించిన రైతు నేస్తం వందో ఎపిసోడ్‌లో భాగంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రైతులను ఉద్దేశించి మాట్లాడగా.. రఘునాథపాలెం రైతు వేదిక నుంచి కలెక్టర్‌ హాజరయ్యారు. ఈ కార్యక్రమం అనంతరం అధికారులతో సమావేశమైన కలెక్టర్‌ మాట్లాడుతూ రైతులు నష్టపోకుండా అన్ని మండలాల్లో అవగాహన కల్పిస్తుండగా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఆతర్వాత రైతు వేదికలో ఏర్పాటుచేసిన విత్తనమేళాలో రకాలు, నాణ్యతపై కలెక్టర్‌ ఆరాతీశారు. ఏడీఏలు కొంగర వెంకటేశ్వరరావు, ఎం.సతీష్‌కుమార్‌, ఏఓ కె.ఉమామహేశ్వర్‌రెడ్డి తదితరులుపాల్గొన్నారు.

కార్యాలయాల నిర్మాణం త్వరగా పూర్తిచేయాలి

ఖమ్మంరూరల్‌: అన్ని ప్రభుత్వ శాఖలు ఒకేచోట కొలువుదీరేలా నిర్మిస్తున్న మండల కార్యాలయాల సముదాయ భవనాన్ని త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్‌ దివాకర సూచించారు. వరంగల్‌ క్రాస్‌ రోడ్డులో ని తరుణీహాట్‌ వద్ద నిర్మిస్తున్న ఖమ్మం రూరల్‌ మండల సమీకృత కార్యాలయాల సముదాయం పనులను కలెక్టర్‌ తనిఖీ చేసి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సముదాయం ద్వారా ఏదులాపురం మున్సిపాలిటీ, రెవెన్యూ, పంచాయతీరాజ్‌, వ్యవసాయ, ఉద్యానవన, విద్యుత్‌, విద్యాశాఖ, శిశు సంక్షేమం, రిజిస్ట్రేషన్‌, ఆర్‌అండ్‌బీ, నీటిపారుదల, మిషన్‌ భగీరథ, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం తదితర కార్యాలయాలన్నీ ఒకే చోట కొలువుదీరతాయని తెలిపారు. తహసీల్దార్‌ వినయేందర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement