‘హరేకృష్ణ మూవ్‌మెంట్’ ఆధ్వర్యాన మధిరలో మెగా కిచెన్
ఈ నెల 27 నుంచి మొదలుకానున్న పంపిణీ
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అందనున్న పోషకాహారం
జిల్లాలో అల్పాహారం పంపిణీ వివరాలు
మధిరలోని
సెంట్రలైజ్డ్
మెగా కిచెన్
అత్యాధునిక మిషన్లతో రుచి, శుభ్రత, నాణ్యత కలిగిన పౌష్టిక విలువలతో అల్పాహారం తయారీకి మెగా కిచెన్లు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 31 కిచెన్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించగా.. ఐదు సెంట్రలైజ్డ్ కిచెన్లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. ప్రస్తుతం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర కేంద్రంగా ఆరో కిచెన్ సిద్ధమైంది. ఈ కిచెన్ ద్వారా అల్పాహారం తయారీ, సరఫరా ట్రయల్ రన్ ఇప్పటికే చేపట్టగా.. ఈ నెల 27న అధికారికంగా ప్రారంభించనున్నారు.
మధిర: గుడిలో దేవుడికి నైవేద్యం సమర్పించినట్లుగా బడిలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటే అల్పాహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులందరికీ రుచి, శుచి కలిగిన పోషకాహారం అందించడమే లక్ష్యంగా హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ (హెచ్‌కేఎంసీఎఫ్)కు బాధ్యతలు అప్పగించారు. విద్యార్థులకు పోషకాలతో కూడిన అల్పాహారం, భోజనం సమకూరిస్తే భవిష్యత్ తరాలు బాగుండడమే కాక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, హాజరు పెరుగుతుందని భావిస్తున్నారు. ఆకలితో అలమటించే ప్రాణం అక్షరాలపై దృష్టి సారించలేరనే భావనతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమంలో హెచ్‌కేఎంసీఎఫ్ భాగస్వామిగా చేరింది. ఇప్పటికే రాష్ట్రంలోని కొడంగల్, వరంగల్, నార్సింగ్, కంది, మహబూబ్‌నగర్‌లో సెంట్రలైజ్డ్ మెగా కిచెన్లు ఏర్పాటు చేయగా విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఈ కిచెన్ల ద్వారా పాఠశాలలకు అల్పాహారం సరఫరా చేస్తుండడంతో వరంగల్, కొడంగల్‌లో విద్యార్థుల హాజరు శాతం భారీగా పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి.
ప్రయోజనాలు
పోషకాహారం కలిగిన ఆహారం లభిస్తే విద్యార్థులు పాఠశాలకు క్రమం తప్పకుండా వస్తుండడంతో హాజరు శాతం పెరుగుతోంది. అందరూ పాఠశాలల్లో చేరితే బడి బయటి పిల్లల సంఖ్య తగ్గి బాలకార్మిక వ్యవస్థ కనుమరుగవుతుంది. ఉదయాన్నే సంతృప్తికరంగా ఆహారం తీసుకుంటే విద్యార్థుల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరిగి చదువుపై దృష్టి సారిస్తారు. పోషకాహారంతో పిల్లల మానసిక, శారీరక ఎదుగుదల సాధ్యమవుతుంది. రోగనిరోధక శక్తి పెరిగి అనారోగ్య సమస్యలు దరిచేరవు. కులమతాలు, పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతీ విద్యార్థికి ఒకే ఆహారం ఇవ్వడం వల్ల పిల్లల్లో అందరూ సమానమనే భావన కలుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వ్యవసాయ కూలీల కుటుంబాలు, ఉద్యోగాలకు వెళ్లేవారు తమ పిల్లలకు అల్పాహారం చేసి పెట్టే ఖర్చు, సమయం ఆదా అవుతుంది.
27న ప్రారంభం
హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యాన జిల్లాలో స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమాన్ని ఈ నెల 27వ తేదీన అధికారికంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే మూడు రోజులుగా మధిర నియోజకవర్గంలో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. మధిరలో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ మెగా కిచెన్ నుంచి జిల్లాలోని 16 మండలాల్లో 798 పాఠశాలల్లో సుమారు 44,125 మందికి అల్పాహారం ఇక్కడి నుంచి సరఫరా అవుతోంది. అంతేకాక ఎనిమిది ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే 3,100 మంది విద్యార్థులకు కూడా అల్పాహారం అందిస్తారు. ఈ నెల 27 నుంచి అధికారంగా మెగా కిచెన్ నుంచి విద్యాసంస్థలకు అల్పాహారం పంపిణీ మొదలుకానుంది. ఇందుకోసం జిల్లాను 35 రూట్లుగా విభజించి వాహనాలు సమకూర్చారు. ఎంత మందికైనా త్వరగా వంట చేసేలా మెగా కిచెన్‌లో నూతన సాంకేతికతతో కూడిన యంత్రాలు అమర్చారు. కిచెన్ నుంచి అల్పాహారంతో వాహనాలు ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు మొదలవుతాయి. మొదటి పాఠశాలకు 6.30 గంటలకు, చివరి పాఠశాలకు 8.30 గంటలకు వాహనం చేరేలా రూట్లు ఖరారు చేశారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సహకారంతో మెనూ రూపొందించగా.. విద్యార్థులందరికీ రోజు విడిచి రోజు స్వచ్ఛమైన పాల పంపిణీకి మెగా మిల్క్ బల్క్ యూనిట్ సైతం ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల విద్యార్థులకు అల్పాహారం


