అందుబాటులోకి జియో సైన్స్ ల్యాబోరేటరీ
కొత్తగూడెంలో ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి
రుద్రంపూర్: సింగరేణి గనుల్లో తవ్వకాల సందర్భంగా వెలువడే ఖనిజాల నమూనాల విశ్లేషణ, బొగ్గు నాణ్యత నిర్ధారణ కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ల్యాబ్ అందుబాటులోకి వచ్చింది. కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలో రూ.13 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన జియోసైన్స్ ల్యాబోరేటరీని కొత్తగూడెం పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంస్థ సీఎండీ బుద్ధప్రకాశ్ జ్యోతితో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ల్యాబ్‌లో అత్యాధునిక యంత్ర పరికరాలు, ఖనిజాల విశ్లేషణ, బొగ్గు నాణ్యత నిర్ధారణకు చేసే పరీక్షల వివరాలు తెలుసుకున్నారు. ఈ ల్యాబ్ ద్వారా ఖనిజ నమూనాల విశ్లేషణ, బొగ్గు నాణ్యత నిర్ధారణ వేగంగా పూర్తికావడమే కాక కచ్చితమైన ఫలితాలు వస్తాయని అధికారులు తెలిపారు. అనంతరం భట్టి మాట్లాడుతూ.. సింగరేణిలో శాసీ్త్రయ పరిశోధనలకు ప్రోత్సాహం, గనుల్లో ఆధునికత కోసం అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో భద్రాద్రి కలెక్టర్ అంకిత్, సింగరేణి డైరెక్టర్లు గౌతం పొట్రు, సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, తిరుమల్‌రావు, భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్, భద్రాద్రి ఎస్పీ రోహిత్‌రాజు, వైరా ఎమ్మెల్యే రాందాస్, కొత్తగూడెం మేయర్ మూడ్ గణేశ్, నాయకులు పాల్గొన్నారు.
సత్తుపల్లిలో క్వార్టర్లు ప్రారంభం
సత్తుపల్లి: సత్తుపల్లి జేవీఆర్ ఓసీ–2 పరిధి కిష్టారంలో నిర్మించిన అధికారుల క్వార్టర్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయితో కలిసి ప్రారంభించారు. అంతేకాక ఓసీ–2లో బొగ్గు ఉత్పత్తిని పరిశీలించాక అధికారులతో సమావేశమై నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి ఆవశ్యకత, లక్ష్యాల సాధనపై సూచనలు చేశారు. స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్‌మిట్టల్, టీఎస్ జెన్‌కో చైర్మన్ హరీశ్, కలెక్టర్ దివాకర టీ.ఎస్., సబ్‌కలెక్టర్ అజయ్‌యాదవ్, డీఎఫ్‌ఓ అనూజ్ అగర్వాల్, ఏసీపీ వసుంధరయాదవ్, జీఎం చింతల శ్రీనివాస్, మున్సిపల్ చైర్‌పర్సన్ ఎం.డీ.రెహానా, సర్పంచ్ నరుకుళ్ల రాజేశ్వరి, నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, కమల్‌పాషా, బొంతు సుమలత, దోమ ఆనంద్‌బాబు, సీతారామయ్య, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


