సాగర్‌ ప్రధాన కాల్వకు మరమ్మతులు | - | Sakshi
Sakshi News home page

సాగర్‌ ప్రధాన కాల్వకు మరమ్మతులు

Jul 24 2026 12:40 AM | Updated on Jul 24 2026 12:40 AM

● రూ.కోటి వ్యయంతో అంచనాలు సిద్ధం ● డిజైన్‌కు విరుద్ధంగా నీటి ప్రవాహమే కారణం?

● రూ.కోటి వ్యయంతో అంచనాలు సిద్ధం ● డిజైన్‌కు విరుద్ధంగా నీటి ప్రవాహమే కారణం?

ఖమ్మంఅర్బన్‌: సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా ఏన్కూరు రాజీవ్‌ లింక్‌ కెనాల్‌ నుంచి నాగార్జునసాగర్‌ ప్రధాన కాల్వలోకి గోదావరి జలాలను తరలిస్తున్నారు. ఈ క్రమాన పలు సమస్యలను జలవనరుల శాఖ అధికారులు గుర్తించారు. సాగర్‌ ప్రధాన కాల్వలో పలుచోట్ల నీరు.. కట్టను ఆనుకుని ప్రవహిస్తుండడంతో ముందస్తు మరమ్మతులకు సిద్ధమవుతున్నారు. ఏన్కూరు నుంచి ఖమ్మం వరకు సాగర్‌ ప్రధాన కాల్వ ద్వారా సుమారు 1,500 క్యూసెక్కుల మేర నీటిని పంపింగ్‌ చేస్తుండగా ఖమ్మం చేరే వరకు 200 క్యూసెక్కుల మేర చేరుతోందని చెబుతున్నారు. అయితే, నీటి ప్రవాహం ఒత్తిడితో కొన్ని ప్రాంతాల్లో కాల్వ కట్టలకు నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. సాగర్‌ కాల్వల డిజైన్‌కు భిన్నంగా షట్టర్ల వద్ద నీటిని నిల్వ చేసి ఎగువకు ప్రవహింపజేస్తుండడమే ఈ పరిస్థితికి కారణమని గుర్తించినట్లు సమాచారం. ఏన్కూరు నుంచి తిమ్మరావుపేట వరకు, వి.వెంకటాయపాలెం సమీపాన ప్రధానంగా సమస్య ఏర్పడిందని.. బ్యాంకింగ్‌ ఉన్న ప్రాంతాల్లో కట్టలపై ఒత్తిడి పెరుగుతోందని తెలిసింది. ఏదిఏమైనా ప్రమాదాలు జరగకముందే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. ఏన్కూరు నుంచి ఖమ్మం వరకు 12 కి.మీ. మేర కాల్వ కట్టలకు మరమ్మతులు అవసరమని గుర్తించగా.. సుమారు రూ.కోటి నిధులతో పనులు చేపట్టేందుకు అంచనాలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వ అనుమతి రాగానే ఒకటి, రెండు రోజుల్లో పనులు ప్రారంభించే అవకాశముందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement