ఖమ్మంమయూరిసెంటర్: వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఖమ్మం బీసీ స్టడీ సర్కిల్‌లో 125 రోజుల ఉచిత ఫౌండేషన్ శిక్షణ ఇవ్వనున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి.శ్రీలత తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణులైన ఉమ్మడి జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈ బీసీ, అనాథ అభ్యర్థులకు గ్రూప్–1, 2, 3, 4తో పాటు బ్యాంకింగ్, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, పోలీస్ నియామక పరీక్షలకు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. హాజరుశాతం ఆధారంగా స్టైఫండ్ కూడా మంజూరవుతుందని తెలిపారు. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలు మించకూడదని.. డిగ్రీ మార్కులు, రిజర్వేషన్లు, సీట్ల లభ్యత ఆధారంగా ఎంపిక ఉంటుందని వెల్లడించారు. రెగ్యులర్ కోర్సులు చదువుతున్న వారు, ఉద్యోగాలు చేస్తున్నవారు, గతంలో స్టడీ సర్కిల్‌లో శిక్షణ పొందిన అనర్హులని తెలిపారు. ఈనెల 25 నుంచి ఆగస్టు 14వ తేదీ వరకు www. tgbcstudycircle.cgg. gov. in సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే 18 జాబితా ప్రకటించి, 20న సర్టిఫికెట్లు పరిశీలించాక 25వ తేదీన శిక్షణ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. వివరాలకు ఖమ్మంలోని బీసీ స్టడీ సర్కిల్‌లో లేదా 08742–227427, 94419 31359, 90597 93456 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
జలవనరులశాఖ
సీఈగా వాసంతి
ఖమ్మంఅర్బన్: జలవనరులశాఖ జిల్లా సీఈగా జి.వాసంతి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇన్నాళ్లు మంగళపూడి వెంకటేశ్వర్లు ఇన్‌చార్జ్ సీఈగా వ్యవహరించారు. ఇటీవల కల్లూరు ఎస్‌ఈగా పనిచేస్తూ పదోన్నతిపై హైదరాబాద్ వెళ్లిన వాసంతిని తిరిగి ఖమ్మం కేటాయించారు. దీంతో ఆమె బాధ్యతలు స్వీకరించగా అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
కార్పొరేట్ స్థాయిలో
వైద్యసేవలు
నేలకొండపల్లి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి కె.రాజశేఖర్‌గౌడ్ వెల్లడించారు. నేలకొండపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను గురువారం తనిఖీ చేసిన ఆయన చికిత్స పొందుతున్న వారితో మాట్లాడారు. అనంతరం వైద్యులతో సమావేశమైన డీసీహెచ్‌ఎస్ ప్రజలకు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈనెల 28న నేలకొండపల్లిలో నిర్వహించనున్న రక్తదాన శిబిరం విజయవంతం అయ్యేలా విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి మంగళ తదితరులు పాల్గొనగా, కాంగ్రెస్ నాయకులు బచ్చలకూరి నాగరాజు, జెర్రిపోతుల అంజని, సోమనబోయిన సాయినవీన్, కడియాల నరేష్ సమస్యలపై విన్నవించారు.
ప్రత్యామ్నాయ
పంటల సాగుతో మేలు
కూసుమంచి: వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య సూచించారు. కూసుమంచి మండలం కిష్టాపురంలో గురువారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యాన వరి కాకుండా తక్కువ నీటితో సాగయ్యే పంటలు ఎంచుకోవాలని కోరారు. పెసర, కంది, జొన్న, ఆముదం వంటి తక్కువ కాల వ్యవఽధి పంటలు లాభదాయకంగా ఉంటాయన్నారు. అంతేకాక వ్యవసాయ భూముల్లో వర్షపు నీటిని నిల్వ చేసేలా కుంటలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో ఏఓ వాణి, ఏఈఓ జానీ, రైతులు పాల్గొన్నారు.
వీఓ భవన నిర్మాణానికి రూ.25 లక్షల స్థల విరాళం
చింతకాని: మండలంలోని అనంతసాగర్‌లో వీఓ భవన నిర్మాణానికి మాజీ సర్పంచ్ నూతలపాటి మంగతాయమ్మ – వెంకటేశ్వరరావు దంపతులు గురువారం స్థలం విరాళంగా అందజేశారు. ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోవడంతో తన తల్లిదండ్రులు నూతలపాటి నందమయ్య – లక్ష్మీభాయమ్మ జ్ఞాపకార్థం రూ.25 లక్షల విలువైన 200 గజాల స్థలం అందించేందుకు వెంకటేశ్వరరావు ముందుకొచ్చారు. రిజిస్ట్రేషన్ పత్రాలను ఐకేపీ ఏపీఎం నాగపుల్లారావుకు అందజేయగా ఎంపీడీఓ శ్రీనివాసరావు సన్మానించారు. సర్పంచ్ జడ ప్రమీల, ఉపసర్పంచ్ కె.రామయ్య, చల్లా అచ్చయ్య, జె.ఆదినారాయణ, జడ సుధాకర్, తన్నీరు రవి, కృష్ణయ్య, సీతయ్య, పుల్లారావు, సాంబయ్య, సీసీ అనురాధ పాల్గొన్నారు.


