పూర్తయిన పనులు ఇవే..
వైరా రిజర్వాయర్
కాల్వల ఆధునికీకరణ
మూడో విడతలో రూ.67 కోట్లు
డిప్యూటీ సీఎం భట్టి ప్రతిపాదనతో మంజూరు
వైరా: వందేళ్ల చరిత్ర కలిగిన వైరా రిజర్వాయర్‌ను ఆనాటి నిజాం నవాబ్ హయంలో నిర్మించారు. ఆయకట్టు కింద సుమారు 25 వేల ఎకరాలకు ఈ రిజర్వాయర్ నుంచి సాగునీరు అందుతోంది. అయితే, ఏళ్లుగా నిర్వహణ లేకపోవడంతో చివరి ఆయకట్టుకు నీరందక రైతులు ఇబ్బంది పడ్డారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని 2009–10లో ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ హయంలో రూ.65 కోట్లు మంజూరు చేశారు. దీంతో కుడి కాల్వ 24 కి.మీ.కు గాను 7.8 కి.మీ. వరకు, ఎడమ కాల్వ 15 కి.మీ.కు 9.5 కి.మీ. మేర గైడ్ వాల్స్ నిర్మాణం చేపట్టారు. మళ్లీ ఎవరూ పట్టించుకోకపోగా.. రెండున్నరేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రూ.42 కోట్లు మంజూరు చేసింది.
ఇప్పుడు రూ.67 కోట్లు
రెండో దఫా నిధులతో పనులు చేపడుతున్నా ఇంకొన్ని పనులకు నిధులు అవసరమైంది. దీంతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచనలతో జలవనరుల శాఖ అధికారులు రూ.67 కోట్లు అవసరమని నెల క్రితం ప్రతిపాదనలు సమర్పించారు. మొదటి, రెండో దశ ఆధునికీకరణ నిధులు కూడా ఆయన ప్రతిపాదనలతో మంజూరు కాగా.. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో మూడో దఫా నిధులు కూడా మంజూరుకు అంగీకరించారు. ఈ నిధులతో ప్రధానంగా కుడి కాల్వ పరిధిలో మిగిలిన ఆరు కి.మీ., ఎడమ కాల్వ పరిధిలో నాలుగు కి.మీ. మేర గైడ్ వాల్స్ నిర్మిస్తారు. ఇక డిస్ట్రిబ్యూటరీలు కుడి కాల్వ పరిధిలో 4వ నంబర్ నుంచి 19–ఏ నంబర్ వరకు, 26, 28 డిస్ట్రిబ్యూటరీలతో పాటు ఎడమ కాల్వ పరిధిలో 6, 7, 8వ డిస్ట్రిబ్యూటరీలు, లింగన్నపాలెం బ్రాంచ్ కెనాల్ కాల్వ వరకు ఆధునికీకరణ పనులు చేపడుతారు. మొత్తం పనులు పూర్తయితే ఆయకట్టు పరిధిలో 25 వేల ఎకరాలకు సాఫీగా నీరు అంది రైతుల ఇక్కట్లు తీరనున్నాయి. ఈ అంశంపై ఐబీ ఈఈ బాబూరావు మాట్లాడుతూ.. రెండో విడత పనులు 90 శాతం పూర్తయ్యాయని తెలిపారు. మూడో విడత నిధులు వచ్చే బడ్జెట్ వరకు కేటాయించే అవకాశముందని వెల్లడించారు.
రెండో దశలో మంజూరైన రూ.42 కోట్లతో చేపట్టిన పనులు చివరి దశకు చేరాయి. రిజర్వాయర్ కుడి, ఎడమ కాల్వలను 22 కి.మీ. ఆధునికీకరించాల్సి ఉంది. వీటిలో తూములను పునఃనిర్మించడంతో పాటు ప్రధాన కాల్వల నుంచి డిస్ట్రిబ్యూటరీ కాల్వల మార్గాన్ని ఆధునికీకరించాలి. తద్వారా చివరి ఆయకట్టు వరకు సాగు నీరు సాఫీగా అందనుంది. గత ఏడాది మంజూరైన నిధుల్లో 90 శాతం పనులు పూర్తయ్యాయి. కుడి, ఎడమ కాల్వల పరిధిలో 12. 5 కి.మీ. మేర ఆధునికీకరణ పనులు చేపట్టగా.. మిగతా కాల్వతో పాటు డిస్ట్రిబ్యూటరీల పనులు చేపట్టాల్సి ఉంది.


