మేడేపల్లికి బడి కావాలి.. | - | Sakshi
Sakshi News home page

మేడేపల్లికి బడి కావాలి..

Jun 6 2026 12:11 AM | Updated on Jun 6 2026 12:11 AM

● పిల్లల చదువు కోసం గొత్తికోయల గోస ● పూర్వ కలెక్టర్‌, డీఎఫ్‌ఓ చొరవ చూపినా ముందుకు సాగని పనులు ● అటవీ అభ్యంతరాలతో నిలిచిన కంటైనర్‌ పాఠశాల నిర్మాణం

● పిల్లల చదువు కోసం గొత్తికోయల గోస ● పూర్వ కలెక్టర్‌, డీఎఫ్‌ఓ చొరవ చూపినా ముందుకు సాగని పనులు ● అటవీ అభ్యంతరాలతో నిలిచిన కంటైనర్‌ పాఠశాల నిర్మాణం

ఏన్కూరు: అంతా కూటి కోసం పొట్ట చేతపట్టుకొని రాష్ట్రాల దాటి వలస వచ్చిన వారే. పోడు కొట్టుకొని తిండి గింజలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత 15ఏళ్లుగా ఏన్కూరు మండలం కొత్తమేడేపల్లి అటవీ ప్రాంతంలో దుర్భర జీవనం సాగిస్తున్న ఈ వలస గొత్తి కోయలకు విద్యుత్‌, విద్యం, వైద్య సౌకర్యాలు అందడం లేదు. అయినా భరిస్తూ తమ పిల్లలకు మాత్రం ఆ పరిస్థితి రావొద్దని ఆశిస్తున్నారు. పిల్లలను చదివించాలని ఆశపడుతున్న వీరు.. తద్వారా కూలీలుగా కాకుండా గౌరవంగా బతుకుతారని చెబుతున్నారు. ఈమేరకు అధికారులు కూడా స్పందిస్తేనే వీరి పిల్లలకు విద్యాబుద్ధులు అందనున్నాయి.

15 ఏళ్ల క్రితం వలస వచ్చి..

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పలువురు గొత్తికోయలు పదిహేనేళ్ల క్రితం ఏన్కూరు మండలం మేడేపల్లికి వచ్చారు. సమీప అడవిలో పోడు కొట్టుకొని పంటలు సాగు చేస్తూ ఇక్కడే జీవిస్తున్నారు. క్రమేణా వీరి నివాస ప్రాంతం కొత్త మేడేపల్లిగా స్థిరపడింది. ఇక్కడ సుమారు 60 కుటుంబాలు నివసిస్తుండగా వీరిలో 180 మందికి ఓటు హక్కు కూడా ఉంది. కానీ వీరి పిల్లల కోసం పాఠశాల లేకపోవడంతో 30 మంది చదువుకు దూరమవుతున్నారు. వీరి ఆవేదన గుర్తించి బాలవెలుగు ఆధ్వర్యాన పాఠశాలను ఏర్పాటుచేసినా కొన్నాళ్లకు మూతపడడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.

ఆ అధికారులు బదిలీ అయ్యారని..

గొత్తికోయల పిల్లలు చదువుకు దూరమవుతున్నాయని తెలియడంతో గత కలెక్టర్‌, అటవీ అధికారులు పాఠశాల నిర్మాణానికి అనుమతి మంజూరు చేసారు. అంతేకాక రూ.2లక్షలు కూడా విడుదల చేయడంతో కంటైనర్‌ పాఠశాల నిర్మాణానికి మండల విద్యా శాఖాధికారులు శంకుస్థాపన చేసి పునాది నిర్మాణం పూర్తి చేశారు. ఈలోగా అటవీ అధికారులు అటవీ ప్రాంతంలో నిర్మాణం నిలిపివేయాలని ఆదేశించడంతో పనులు నిలిచిపోయాయి. ఫలితంగా నిర్మాణం ఆగిపోయింది. దీంతో గొత్తికోయలు ఏమిటని ఆరా తీయగా అనుమతి ఇచ్చిన కలెక్టర్‌, అటవీశాఖ అధికారి బదిలీ అయ్యారని చెప్పడంతో నివ్వెరపోయారు. ఆపై స్థానిక విద్యాశాఖాధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా కొత్తమేడేపల్లిలో పరిశీలించారు. కొత్తగా పోడు కొట్టమని, అటవీ జంతువులను వేటాడబోమని రాసి ఇవ్వాలని సూచించగా గొత్తికోయలంతా సంతకాలు పెట్టారు. అయితే, ఈనెల 12వ తేదీన నూతన విద్యాసంవత్సరం మొదలుకానున్నందున ఆలోగా పాఠశాల నిర్మాణం పూర్తిచేసి తమ పిల్లలకు చదువు నేర్చేలా అధికారులు చొరవ చూపాలని గొత్తికోయలు కోరుతున్నారు. వీరి గోడు అధికారులు ఆలకిస్తారో, లేదో తేలాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement