బకాయిల సాధనకు ఆందోళనలు | - | Sakshi
Sakshi News home page

బకాయిల సాధనకు ఆందోళనలు

Jun 6 2026 12:11 AM | Updated on Jun 6 2026 12:11 AM

ఖమ్మంరూరల్‌: రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు రూ.వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, తద్వారా తమకు ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చామని బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(బీఏఐ) నాయకులు, కాంట్రాక్టర్లు వెల్లడించారు. ఈమేరకు ఏదులాపురంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో శుక్రవారం బీఏఐ ఆల్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ డీవీఎన్‌.రెడ్డి, రాష్ట్ర చైర్మన్‌ శ్రీనివాసరావు, కార్యదర్శి పవన్‌, కోశాధికారి సంతోష్‌రెడ్డి, కిసాన్‌ శ్రీనివాసరావు, ఖమ్మం చైర్మన్‌ కిశోర్‌ తదితరులు కార్యక్రమ పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. కొన్నేళ్లుగా వివిధ ప్రభుత్వ శాఖల నుంచి బిల్లులు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. కొందరికి మాత్రం బిల్లులు అందుతుండగా, మిగతా రూ.వందల కోట్ల పనులు చేసిన కాంట్రాక్టర్లకు సమస్యలు వస్తున్నాయని చెప్పారు. ఈకారణంగా స్కిల్డ్‌, నాన్‌ స్కిల్డ్‌ కార్మికులు, వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక పలువురు కాంట్రాక్టర్లు గుండెపోటుతో మృతి చెందగా, ఇంకొందరు బలవన్మరణానికి పాల్పడ్డారని తెలిపారు. ప్రభుత్వానికి తాము వ్యతిరేకం కాదని, పనుల ఆధారంగానే బిల్లులు చెల్లించాలని కోరుతున్నట్లు చెప్పారు. అంతేకాక బిల్లుల చెల్లింపు వివరాలు తెలుసుకునేందుకు సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకపోగా, వెబ్‌సైట్‌ను కూడా మూసివేశారని వాపోయారు. విధిలేని పరిస్థితుల్లో బిల్లుల సాధన కోసం ఈనెల 18న చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యాన ఉమ్మడి జిల్లా నుంచి బిల్డర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, కాంట్రాక్టర్లు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంతో కూడా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే దశలవారీగా ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు.

బీఏఐ రాష్ట్ర నాయకులు, కాంట్రాక్టర్ల వెల్లడి

Advertisement
 
Advertisement
Advertisement