వానాకాలం సాగుకు సై.. | - | Sakshi
Sakshi News home page

వానాకాలం సాగుకు సై..

May 18 2026 12:18 AM | Updated on May 18 2026 12:18 AM

● అన్నీకలిపి 6.47లక్షల ఎకరాల్లో సాగవుతాయని అంచనా ● ఈసారి కూడా వరి, పత్తికే అగ్రస్థానం ● సరిపడా విత్తనాలు, ఎరువులు సమకూర్చేలా సన్నాహాలు ముందస్తుగా సన్నాహాలు 3.20లక్షల ఎకరాల్లో వరి పత్తి విత్తనాలు.. 5.38 లక్షల ప్యాకెట్లు

వానాకాలం పంటల సాగుకు జిల్లా వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. జిల్లాలోని వనరుల ఆధారంగా పంటల సాధారణ సాగు విస్తీర్ణం అంచనాలను రూపొందించారు. ఎప్పటిలాగే రానున్న వానాకాలంలో సీజన్‌లోనూ వరి, పత్తి పంటలతో పాటు మిర్చి, పెసర, మొక్కజొన్న, మినుము, కంది, వేరుశనగ సాగవుతాయని గుర్తించారు. – ఖమ్మంవ్యవసాయం
పంటల వారీగా ప్రణాళిక ఖరారు
● అన్నీకలిపి 6.47లక్షల ఎకరాల్లో సాగవుతాయని అంచనా ● ఈసారి కూడా వరి, పత్తికే అగ్రస్థానం ● సరిపడా విత్తనాలు, ఎరువులు సమకూర్చేలా సన్నాహాలు

వానాకాలం సాగుకు సంబంధించి పంటల వారీగా అంచనాలు రూపొందించాం. అందుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లాలో తొలుత సాగు మొదలుపెట్టే పత్తి విత్తనాలను సమకూర్చేందుకు సన్నాహాలు ప్రారంభించాం. అలాగే, భూసారాన్ని పెంచే పచ్చిరొట్ట విత్తనాలు కూడా సరఫరా చేస్తాం.

– ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి

జిల్లాలోని 21 మండలాల్లో పంటల సాగుకు 6,47,754 ఎకరాల భూమి అనువుగా ఉందని వ్యవసాయ శాఖ గుర్తించింది. గత ఏడాది అన్నీ కలిపి 6,17,858.31 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. కానీ రానున్న సీజన్‌లో దాదాపు 30 వేల ఎకరాలు పెరిగే అవకాశముందని భావిస్తూ 6.45ఎకరాల్లో పంటలు సాగవుతాయనే నిర్ధారణకు వచ్చారు. ఇందులో ప్రధాన పంట అయిన వరి 3,20,301 ఎకరాల్లో సాగవుతుందని అంచనాల్లో పొందుపరిచారు. ఇక మరో ప్రధాన పంట పత్తి 2,69,715 ఎకరాల్లో సాగయ్యే అవకాశముందని భావిస్తున్నారు. ఈ అంచనాల ఆధారంగా గత ఏడాదితో పోలిస్తే వరి 15 వేల ఎకరాల్లో, పత్తి 13 వేల ఎకరాల్లో పెరగనుంది. అంతేకాక పత్తి, మిర్చికి ధర ఆశాజనకంగా ఉండడంతో రైతులు మొగ్గు చూపే అవకాశముంది. ఈమేరకు మిర్చి సాగు 33 వేల ఎకరాలుగా ప్రణాళికలో పొందుపర్చారు. రెండేళ్ల క్రితం వరకు జిల్లాలో 1.06 లక్షల ఎకరాల్లో మిర్చి సాగయ్యేది. కానీ ధర పతనం కావటం, విదేశీ ఎగుమతులు లేకపోవడంతో ఏటేటా తగ్గుతూ వస్తోంది. అయితే, ఈ ఏడాది మిర్చికి మంచి ధర రావడంతో వానాకాలంలో సాగు పెరుగుతుందని భావిస్తున్నారు.

వానాకాలం సాగయ్యే పంటలకు అనుగుణంగా విత్తన ప్రణాళికలను సైతం వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. వరి విత్తనాలు 80 వేల క్వింటాళ్ల మేర అందుబాటులో తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ వద్ద వరి, పెసర, మినుము, కంది వంటి విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ఇక 2.69 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయనుండగా, ఎకరాకు రెండు చొప్పున 5.38 లక్షల విత్తన ప్యాకెట్లకు గాను 6.74 లక్షల విత్తన ప్యాకెట్లను అందుబాటులో తీసుకొచ్చేలా చర్యలు చేపట్టారు. అంతేకాక తొలకరి వర్షాలు కురవగానే రైతులు భూసారాన్ని పెంచేలా సాగు చేసే పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు సమకూర్చనున్నారు. ఈ విత్తనాలను పీఏసీఎస్‌, ఆగ్రోస్‌ సంస్థల ద్వారా రైతులకు సరఫరా చేస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement