ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా లబ్ధిదారుల
గుర్తింపు
జిల్లాలో వచ్చేనెల 15వరకు ప్రత్యేక డ్రైవ్
మృతుల పింఛన్ల తొలగించే లక్ష్యం
ఖమ్మంమయూరిసెంటర్: ప్రభుత్వం అందిస్తున్న ‘చేయూత’ పెన్షన్ల పంపిణీలో అనర్హులను తొలగించేందుకు అధికారులు సాంకేతికతను వినియోగించుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులను సరిచూసేందుకు ఎఫ్‌ఆర్‌ఎస్(ఫేస్ రికగ్నైజ్డ్ సిస్టమ్ – ముఖ గుర్తింపు విధానం)ను ప్రారంభించారు. గ్రామీణ, మున్సిపాలిటీల్లో ఈ ప్రక్రియ ఏకకాలంలో సాగుతోంది. ఇందుకోసం ప్రభుత్వం రూపొందించిన యాప్‌ల ద్వారా ఆధార్ నంబర్ సహా లబ్ధిదారుల లైవ్ ఫొటోను నమోదు చేస్తారు. జిల్లాలో ప్రస్తుతం 1,76,950 మందికి చేయూత పెన్షన్ల ద్వారా ప్రభుత్వం నెలకు రూ.42 కోట్లు విడుదల చేస్తోంది.
మరణించిన వారి గుర్తింపునకే ప్రాధాన్యం
పింఛన్ జాబితాలో మరణించిన వారిని గుర్తించేందుకు ఎఫ్‌ఆర్‌ఎస్ విధానాన్ని అమలు చేస్తున్నారు. లబ్ధిదారులు ప్రస్తుతం జీవించి ఉన్నారా, లేదా అనేది క్షేత్రస్థాయిలో నిర్ధారించుకుని.. ఎవరైనా మరణిస్తే పేరు తొలగిస్తారు. తద్వారా కేవలం అర్హులైన వారికే ప్రభుత్వ సాయం అందుతుందని చెబుతున్నారు. ఈనెల 15వ తేదీన మొదలైన డ్రైవ్ జూన్ 15వ తేదీ వరకు కొనసాగనుంది.
వారికే బాధ్యతలు
గ్రామీణ ప్రాంతాల్లో చేయూత లబ్ధిదారుల వివరాలను యాప్‌లో నమోదు చేసే బాధ్యత పంచాయతీ కార్యదర్శులు, ఐకేపీ సిబ్బందికి అప్పగించారు. మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లు, మెప్మా సిబ్బంది ఈ విధులు నిర్వర్తిస్తారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో మాత్రం శానిటరీ ఇన్‌స్పెక్టర్లకు బాధ్యతలను అప్పగించాలని కమిషనర్ నిర్ణయించినట్లు తెలిసింది. జనగణన, ఎస్‌ఐఆర్ వంటి కార్యక్రమాలతో పాటు కార్పొరేషన్‌లోని వివిధ పనులతో వార్డు ఆఫీసర్లు తీరిక లేకుండా ఉన్న నేపథ్యాన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయా ఉద్యోగులు నేరుగా పెన్షన్లు అందుకుంటున్న వారి ఇళ్లకు వెళ్లి తమ ఫోన్‌లోని యాప్ ద్వారా ఆధార్ నంబర్ నమోదు చేస్తారు. ఆ తర్వాత లబ్ధిదారుడి ఫొటోతీసి ఆధార్ డేటాబేస్‌లోని ఫొటోతో సరిపోల్చుకుంటూ (బయోమెట్రిక్ ఫేస్ అథెంటికేషన్) ప్రక్రియ పూర్తి చేస్తారు.
తొలిరోజు సాంకేతిక సమస్యలు
జిల్లాలో చేయూత లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో ఉండటంతో వెరిఫికేషన్ ప్రక్రియకు నెల గడువు విధించారు. లబ్ధిదారులందరినీ లైవ్‌లో గుర్తించాల్సి ఉండటంతో ఈ గడువు నిర్దేశించారు. అయితే సర్వే ప్రారంభమైన తొలి రోజు యాప్‌లో కొన్ని సాంకేతిక లోపాలు తలెత్తినట్లు సిబ్బంది చెబుతున్నారు. అయినా వాటిని సరిచేసుకుంటూ సర్వే కొనసాగించేలా అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
ఆ తర్వాత అర్హులకు..
ప్రభుత్వం కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్తున్నా.. ఎప్పటి నుంచి అనేది ప్రకటించలేదు. జిల్లాల్లో అనర్హులతో పాటు చనిపోయిన వారి పెన్షన్లు తొలగిస్తే కొత్త వారికి చోటు కల్పించవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో మృతుల పేరిట కూడా పింఛన్లు విడుదలవుతున్నాయని అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుత సర్వే ద్వారా వారిని గుర్తించి తొలగిస్తే.. కొత్త పెన్షన్లు మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది.


