ఏదులాపురంలో ఎప్పుడూ అంతే.. | - | Sakshi
Sakshi News home page

ఏదులాపురంలో ఎప్పుడూ అంతే..

May 18 2026 12:18 AM | Updated on May 18 2026 12:18 AM

● ధాన్యం, మక్కల కొనుగోళ్లలో దండుకునుడే లక్ష్యం ● వ్యాపారులకు రెండు చేతులా ఉద్యోగుల సహకారం ● రైతులు పంట తీసుకొస్తే మాత్రం కాంటాల్లో జాప్యం

మాకు సంబంధం లేదు..

● ధాన్యం, మక్కల కొనుగోళ్లలో దండుకునుడే లక్ష్యం ● వ్యాపారులకు రెండు చేతులా ఉద్యోగుల సహకారం ● రైతులు పంట తీసుకొస్తే మాత్రం కాంటాల్లో జాప్యం

ఖమ్మంరూరల్‌: ఏదులాపురం సొసైటీ అధికారులు, సిబ్బంది తీరు మారుతుందనే ఎన్నటికీ నెరవేరేలా కనిపించడం లేదు. తప్పులపై తప్పులు చేస్తూ రైతులను ముప్పు తిప్పలు పెట్టే ఉద్యోగులను ఇదేమిటని ప్రశ్నిస్తే... ‘మేం అంతా బాగా చేస్తున్నాం కదా... ఎందుకు మారాలి’ అని వారికి వారే సర్టిఫికెట్‌ ఇచ్చుకోవడం ఆనవాయితీగా మారింది. గత ఖరీఫ్‌ సీజన్‌లో తరుగు పేరిట రైతుల నుండి అందిన కాడికి దోచుకున్నది చాలదన్నట్లు ఈ యాసంగి మక్కల కొనుగోళ్లలోనూ అదే తీరుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. గత ఏడాది ధాన్యం కొనుగోళ్ల సమయాన అక్రమాలు బయటపడడంతో సొసైటీలోని ఓ ఉద్యోగిని సస్పెండ్‌ చేశారు. అయినా తీరు మార్చుకోకపోవడం గమనార్హం. వీరికి మద్దులపల్లి మార్కెట్‌లోని కొందరు సిబ్బంది జత కలవడం రైతుల ఇక్కట్లు మరింత పెరగడానికి కారణమైంది.

ఉచిత కాంటాలకు తిలోదకాలు

పంట ఉత్పత్తుల విక్రయానికి మార్కెట్‌కు తీసుకొస్తే నిబంధనల ప్రకారం ఉచితంగా కాంటా వేయాలి. కానీ మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్‌లో మాత్రం వే బ్రిడ్జి నిర్వాహకులు రైతులు తెచ్చే మక్కల తూకం వేయడానికి డబ్బు వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఒక్కో ట్రాక్టర్‌కు రూ.100 నుంచి రూ.200 వసూలు చేస్తూ, ఇదేమిటని రైతులు అడిగితే ‘పైవాళ్లే తీసుకోమంటున్నారు’ అని సిబ్బంది చెబుతున్నారని సమాచారం. ఇదికాక కొందరు సిబ్బంది రాత్రి వేళ దొడ్డిదారిన ట్రాక్టర్ల లోడ్‌ను నేరుగా కాంటా వద్దకు తీసుకెళ్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో మార్కెట్‌ చైర్మన్‌ ఆ మార్గంలో ట్రెంచ్‌ కొట్టించడం సిబ్బంది పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది.

రైతులను కాదని..

కొందరు వ్యాపారులు గ్రామాల్లో రైతుల వద్ద తక్కువ ధరకు మక్కలను కొనుగోలు చేసి ట్రాక్టర్లలో మద్దులపల్లి మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఇప్పటికే అక్కడ రైతులు మక్కల కాంటా కోసం రోజుల తరబడి రేయింబవళ్లు పడిగాపులు కాస్తున్నారు. వీరందరినీ కాదని వ్యాపారులు తెచ్చిన మక్కలను మాత్రం ఉద్యోగులు క్షణాల్లో కొనుగోలు చేసి కాంటా వేయడం కళ్ల ముందే జరిగిపోతుంటుంది. ఇందుకు గాను వ్యాపారుల నుంచి క్వింటాకు రూ.100 నుంచి రూ.200 వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

వసూళ్లపై ఆగ్రహం

వే బ్రిడ్జి వద్ద కాంటాపేరుతో ఉద్యోగులు, హమాలీలు అక్రమ వసూళ్లకు పాల్పడతున్నారని ఆగ్రహిస్తూ మక్కల రైతులు నాలుగు రోజుల క్రితం పెద్దతండాలోని గోదాం వద్ద ఆందోళన చేపట్టారు. ట్రక్కుకు రూ.300, బస్తాకు రూ.6 దిగుమతి ఖర్చుల పేరిట వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇవికాక ట్రక్కుకు అదనంగా రూ.500 కూడా అడుగుతున్నారని వాపోయారు. గోదాం ఉద్యోగులు, హమాలీలు ఒక్కటై డబ్బు ఇచ్చిన వారి పంటనే కాంటా వేయడం, దిగుమతి చేస్తున్నారని ఆరోపించారు. అలాకాక నిరాకరిస్తే ఆ రైతుల ట్రాక్టర్లను గోదాం లోపలికి అనుమతించకుండా రోజుల తరబడి నిలిపేస్తున్నారని విమర్శించారు.

ఏ వ్యాపారి నుంచి కూడా మా సిబ్బంది డబ్బు తీసుకోవడంలేదు. వ్యాపారులు తీసుకొచ్చిన మక్కలను కూడా కొనుగోలు చేయడంలేదు. బయట ఒకరిద్దరు రైతులతో మాట్లాడుకుని వ్యవహారం చేస్తే మాకేం సంబంధం? రైతులు నేరుగా మక్కలు అమ్మకానికి తీసుకొస్తే అన్నీ సరిచూశాకే కాంటా వేస్తున్నాం. డబ్బు కూడా రైతుల ఖాతాల్లోనే జమ అవుతుంది.

– మహమద్‌ అలీ, సీఈఓ, ఏదులాపురం సొసైటీ

Advertisement
 
Advertisement
Advertisement