దిగుమతి కాక గోదాం వద్ద
ఎదురుచూపులు
ట్రాక్టర్ల వెయిటింగ్ చార్జి భరించలేక రంగంలోకి..
వేంసూరు: ఆరుగాలం శ్రమించి, చెమట చిందించి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు పడుతున్న అగచాట్లు అన్నీఇన్ని కావు. అయితే, వేంసూరు మండలంలో రైతుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. మండలంలోని కల్లూరుగూడెం సివిల్ సప్లయీస్ గోదాంకు వెళ్లే దారి లేక రెండేళ్లుగా నిరూపయోగంగా ఉంది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్నలు పేరుకుపోతున్నాయనే విషయం తెలుసుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచనలతో గోదాంను వినియోగంలోకి తీసుకొచ్చారు. దీంతో రైతులు సంతోషించగా.. మండలంతో పాటు జిల్లాలోని ఇతర మండలాల్లో కొనుగోలు చేసిన మొక్కజొన్నలను ట్రాక్టర్లు, లారీల్లో తీసుకురావడం మొదలైంది. కానీ కేవలం 20మంది హమాలీలే ఉండడం, వందల సంఖ్యలో వాహనాలు వస్తుండడంతో దిగుమతిలో జాప్యం జరిగి రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ఈ కారణంగా ట్రాక్టర్ల యజమానులు రైతుల నుంచి రోజుకు రూ.వేయి మొదలు రూ.1,500 వరకు వెయిటింగ్ చార్జీ డిమాండ్ చేస్తున్నారు. కొందరు రైతులు డబ్బు చెల్లించే పరిస్థితి లేక ఎవరి మొక్కజొన్న బస్తాలను వారే అన్‌లోడ్ చేసుకోవడం మొదలుపెట్టారు. అంతేకాక పైరవీ చేసే వ్యక్తులు, రాజకీయ పలుకుబడి వారి మక్కలు తొలుత అన్‌లోడ్ చేస్తున్నారని శనివారం వాగ్వాదం జరగగా తహసీల్దార్ మాణిక్‌రావు నచ్చజెప్పారు.


