రైతులకు రంది | - | Sakshi
Sakshi News home page

రైతులకు రంది

Feb 23 2026 7:03 AM | Updated on Feb 23 2026 7:03 AM

రైతుల

రైతులకు రంది

నీరు లేక నెర్రెలువారి..

నీటి కొరతతో యాసంగి సీజన్‌

మధ్యలోనే తిప్పలు

కాల్వల్లో పూడిక, కంపచెట్లతో

సాఫీగా సాగని జలాలు

పంటలు ఎండుతున్నాయని

పలుచోట్ల ఆందోళన

మా భూములకు నీరందడం లేదు..

పదిహేను రోజులుగా నీరు లేదు

వారబందీ..

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఓ వైపు వారబందీ విధానంలో నీటి సరఫరా.. మరోవైపు బ్రాంచ్‌ కాల్వల్లో పేరుకుపోయిన పూడిక, అడ్డుగా పెరిగిన కంపచెట్లతో నీరు సాఫీగా సాగక జిల్లాలోని నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పరిధి చివరి ఆయకట్టు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ యాసంగికి సాగర్‌ ఆయకట్టు పరిధిలో 2.55 లక్షల ఎకరాల్లో వరి, మొక్కజొన్న, పెసర తదితర పంటలు సాగవుతున్నాయి. పంటలకు ఈనెల 7 నుంచి వారబందీ విధానంలో సాగర్‌ జలాలు విడుదల చేస్తున్నారు. అయితే జిల్లాలోని ముదిగొండ, తల్లాడ, బోనకల్‌, కొణిజర్ల తదితర మండలాల్లోని చివరి ఆయకట్టు భూములకు నీరందడం లేదు. దీంతో భూములు నెర్రెలువారి పంటలు ఎండిపోతుండడంతో రైతులు రోడ్డెక్కుతున్నారు. ఏప్రిల్‌ 7వ తేదీ వరకు పరిస్థితి ఇలాగే కొనసాగితే పంటలు చేతికి అందడం కష్టమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చివరకు చేరేలోగా.. ఆగుతూ..

జిల్లాలో ఈ యాసంగి సీజన్‌లో అన్నీ కలిపి మొత్తం 3,98,593 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఈ మొత్తం విస్తీర్ణంలో 2.55 లక్షల ఎకరాలకు సాగర్‌ నీరు సరఫరా అవుతోంది. ఈమేరకు 7వ తేదీ నుంచి వారబందీ విధానంలో నీటి విడుదల ప్రారంభించారు. ఇందుకోసం 18.42 టీఎంసీలు అవసరమని లెక్కలు వేశారు.

పాలేరు రిజర్వాయర్‌ నుంచి సాగర్‌ ఎడమ కాల్వ, ఇతర బ్రాంచ్‌ కాల్వల ద్వారా పంట పొలాలకు నీరు చేరుతుంది. కానీ వారబందీ విధానంతో చివరి భూములకు పూర్తి స్థాయిలో అందడం లేదు. ఇటీవల బోనకల్‌, మధిరతో పాటు ఆంధ్రా రైతులు బోనకల్‌లో ఆందోళన చేపట్టారు. వారబందీ విధానంలో వారం విడుదల చేసి, మరో వారం ఆపేస్తుండగా ఆయకట్టులోని మొదటి భూములకు మాత్రమే నీరు అందుతోందని వాపోయారు. పంట చేతికి రావాలంటే మరో రెండు, మూడు తడులు అవసరం కాగా రైతులు రాత్రి కూడా కాల్వలపై పడిగాపులు కాస్తున్నారు.

ఇక్కడి రైతులకు లేకుండానే..

బోనకల్‌ మండలంలోని 20వేల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేశారు. బోనకల్‌ బ్రాంచ్‌ కెనాల్‌ పరిధిలోని దాములూరు, మధిర మేజర్‌కు నీరు సరఫరా చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడి పంటలకు సరిగా నీళ్లు ఇవ్వకుండా ఏపీలోని దిగువ ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీంతో బోనకల్‌ బ్రాంచ్‌ కెనాల్‌ కింద వివిధ గ్రామాల చివరి ఆయకట్టు రైతులు ఇబ్బంది పడుతున్నారు. మొక్కజొన్న కంకి దశలో ఉన్నందున నీటి ఎద్దడితో నష్టం వాటిల్లుతోందని చెబుతున్నారు. మరోవైపు బోనకల్‌ బ్రాంచ్‌ కెనాల్‌కు 1,300 క్యూసెక్కుల నీరు విడుదల చేయాల్సి ఉన్నా కాల్వ కట్టలు పటిష్టంగా లేక 650 – 700 క్యూసెక్కులే ఇస్తున్నారు. ఇక దాములూరు మేజర్‌ పరిధికి 200 క్యూసెక్కుల నీరు కూడా రావడం లేదని రైతులు చెబుతున్నారు.

తల్లాడ మండలంలో ఎన్నెస్పీ కాల్వల కింద భూములకు నీరందక నెర్రెలువారాయి. మొత్తం 23వేలకు పైగా ఎకరాల్లో వరి, మొక్కజొన్న సాగు చేశారు. మండలంలోని సిరిపురం, రామచంద్రాపురం 1, 2 మేజర్లు, గూడూరు 1, 2 మేజర్లు, పుణ్యపురం మేజర్ల పరిధిలోని మైనర్లు సబ్‌ మైనర్లకు నీరు సరఫరా కావడం లేదు. ఇక కొణిజర్ల మండలం అంజనాపురం, గద్దలగూడెం, గుబ్బగుర్తి, రామచంద్రాపురం, రాంపురం, ఉప్పలచలక పరిధిలోని భూములకు కూడా నీరు రావడం లేదు. ఈ మండలంలోని చివరి ఆయకట్టు భూములు గద్దలగూడెం 1, 2, 3 మేజర్ల కింద ఉండగా నీరు అందక మొక్కజొన్న పంటకు నష్టం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ సాగర్‌ చివరి ఆయకట్టు అన్నదాతల దుస్థితి

ఖరీఫ్‌లో పత్తి దెబ్బతిన్నందున యాసంగిలో సొంత భూమి మూడెకరాలు, కౌలుకు రెండెకరాలు తీసుకుని మొక్కజొన్న సాగు చేశా. ప్రస్తుతం కంకి దశలో ఉండగా బోనకల్‌ బ్రాంచ్‌ కెనాల్‌ పరిధిలో వారబందీ శాపంగా మారింది. నీరు మా దగ్గరికి వచ్చేసరికి ఆగిపోతోంది. – చిట్టిమోదు నాగేశ్వరరావు, మోటమర్రి, బోనకల్‌ మండలం

తల్లాడలో ఎన్నెస్పీ కాల్వ కింద నాలుగెకరాల్లో వరి సాగు చేశా. మా పంటలకు సకాలంలో నీరు అందడం లేదు. 15 రోజులుగా నీరు రాకపోవడంతో పంట ఎండిపోతోంది. ఎకరానికి రూ.20 వేలు పెట్టుబడి అయింది. ఎన్నెస్పీ అధికారుల పర్యవేక్షణ లోపంతో ఈ పరిస్థితి ఎదురవుతోంది.

– అక్కల ప్రభాకర్‌రెడ్డి, తల్లాడ

రైతులకు రంది1
1/1

రైతులకు రంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement