మున్సిపాలిటీలో మౌలిక వసతులు కల్పిస్తాం
● కౌన్సిలర్లు పదవిని బాధ్యతగా భావించాలి ● ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తాం ● రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి
ఖమ్మంరూరల్: కొత్తగా ఏర్పడిన ఏదులాపురం మున్సిపాలిటీలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, పాలకవర్గ సభ్యులు పదవిని బాధ్యతగా భావించి ప్రజలకు సేవ చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పెదతండాలోని మున్సిపల్ కార్యాలయంలో శనివారం చైర్‌పర్సన్, పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్ బాధ్యతలు స్వీకరించగా, పొంగులేటి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఏదులాపురం కొత్త మున్సిపాలిటీతో పాటు విస్తీర్ణం పెద్దది కావడంతో మౌలిక వసతులు చాలా అవసరమని తెలిపారు. ఈ విషయాన్ని తాను ఎన్నిక ల పర్యటనలో గుర్తించానని, ఇప్పటికే కొన్ని పనులు చేయగా, మిగిలినవి యుద్ధప్రాతిపదికన చేయాలని నిర్ణయించామని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కౌన్సిలర్లు పని చేసి, తమ సత్తా నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు. వారంలో ఐదు రోజుల పాటు ఉదయం రెండు గంటలు పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ప్రజల కనీస అవసరాలు తీర్చడానికి ప్రభుత్వం, తాను సిద్ధంగా ఉన్నామని చెప్పారు. చాలా వార్డుల్లో పారిశుద్ధ్య సమస్య ఉందని, ఓపెన్ ప్లాట్లలో నీరు నిలిచి ఆ ప్రాంత వాసులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. 15 రోజుల్లో మళ్లీ సమీక్ష నిర్వహిస్తానని, అప్పటి వరకు కౌన్సిలర్లంతా తమ వార్డుల్లోని సమస్యలపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని అన్నారు.
‘ఇందిరమ్మ’ గృహ ప్రవేశం..
మున్సిపాలిటీలోని సత్యనారాయణపురంలో నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి హాజరయ్యారు. లబ్ధిదారుడి కుటుంబసభ్యులకు పట్టు వస్త్రాలు అందించారు. కార్యక్రమంలో మద్దులపల్లి మార్కెట్ చైర్మన్ బైరు హరినాథ్‌బాబు, వార్డు కౌన్సిలర్లు, నాయకులు తోట చినవెంకటరెడ్డి, వెంపటి రవి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.


