కలెక్టరేట్‌లో మీడియా సెంటర్
ఖమ్మం సహకారనగర్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యాన కలెక్టరేట్‌లో మీడియా కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ఈ సెంటర్‌ను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనుదీప్ దురిశెట్టి గురువారం ప్రారంభించి మాట్లాడుతూ అభ్యర్థుల పత్రికా ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారంపై ఈ కేంద్రం ద్వారా పరిశీలన ఉంటుందని తెలిపారు. అంతేకాక మీడియాలో ప్రచార అనుమతులకు జిల్లా మీడియా సర్టిఫికేషన్ అండ్ మీడియా మానిటరింగ్ కమిటీని సంప్రదించాలని సూచించారు. ఈకార్యక్రమంలో డీపీఆర్వో ఎం.ఏ.గౌస్, ఉద్యోగులు కె.ప్రవల్లిక, నవీన్, హరీష్, సిబ్బంది పాల్గొన్నారు.
ఖమ్మంరూరల్: ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. ఖమ్మం రూరల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఏదులాపురం మున్సిపల్ నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఏర్పాట్లు చేయడంతో పాటు అవసరమైన అన్ని పత్రాలు సిద్ధం చేయాలని తెలిపారు. ప్రతీ నామినేషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలని, అభ్యర్థులకు అవసరమైన సూచనలు ఇవ్వాలని చెప్పారు. అలాగే, అభ్యర్థులు విధిగా కొత్త బ్యాంక్ ఖాతా తీసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ మున్వర్‌అలీ, తహసీల్దార్ పి.రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


