పొత్తులు.. ఎత్తులు
స్థానిక బలమే కీలకం
పలుచోట్ల బీఆర్‌ఎస్ – సీపీఎం మధ్య సీట్ల సర్దుబాటు
కాంగ్రెస్, సీపీఐ నడుమ
ఇంకా కుదరని ఏకాభిప్రాయం
సత్తుపల్లి, కల్లూరులో
కాంగ్రెస్ ఒంటరి పోటీనే!
జిల్లాలోని సత్తుపల్లి, మధిర, వైరా, ఏదులాపురం, కల్లూరు మున్సిపాలిటీల్లో పార్టీల నడుమ పొత్తులపై గందరగోళం కొనసాగుతోంది. కొన్నిచోట్ల చర్చలు జరుగుతుండగా.. మరికొన్నిచోట్ల ఒంటరిగానే బరిలోకి దిగేందుకు పార్టీలు సిద్ధమయ్యాయి. ప్రధానంగా కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు కొన్ని మున్సిపాలిటీలకే పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏదులాపురం, వైరా, మధిర మున్సిపాలిటీల్లో ఈ పార్టీల నడుమ చర్చలు
తుది దశకు చేరగా.. సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగనుందని ప్రకటించింది. ఇక బీఆర్‌ఎస్, సీపీఎం మాత్రం కలిసి పోటీ చేసేందుకు నిర్ణయించాయి. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం
జోరుగా చర్చలు
మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు గడువు శుక్రవారం ముగియనుంది. దీంతో చర్చల్లో జోరు పెంచగా.. కాంగ్రెస్–సీపీఐ మధ్య సీట్ల సర్దుబాటు ఎటూ తేలడం లేదని సమాచారం. మున్సిపాలిటీల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నట్లు సంకేతాలు ఇస్తున్నా.. పొత్తులు మాత్రం ఖరారు కాలేదు. ఏదులాపురం, వైరా, మధిరలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తుల కసరత్తు తుది దశకు చేరింది. సత్తుపల్లిలోని 23, కల్లూరులోని 20 వార్డుల్లో మాత్రం చర్చలు తెగకపోవడంతో కాంగ్రెస్ ఒంటరిగానే అన్ని వార్డుల్లో పోటీకి దిగాలని నిర్ణయించింది.
కొన్నిచోట్ల సానుకూలం
ఏదులాపురం మున్సిపాలిటీలో 32 వార్డులు ఉండగా.. ఇప్పటికే 25 వార్డులకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. ఇక మరో నాలుగు వార్డులకు అభ్యర్థులను ప్రకటించకున్నా ఆశావహులతో నామినేషన్లు దాఖలు చేయించింది. ఒకవేళ పొత్తు ఉంటే కాంగ్రెస్ 25 స్థానాల్లో, సీపీఐ ఏడు స్థానాల్లో బరిలో దిగుతుందని తెలుస్తోంది. పొత్తు కుదరకపోతే కాంగ్రెస్ అన్ని స్థానాలకు పోటీ చేయనుండగా.. సీపీఐ మాత్రం బలంగా ఉన్న 15–18 స్థానాల్లో బరిలో నిలవాలని నిర్ణయించుకుంది. వైరా మున్సిపాలిటీలో కాంగ్రెస్ – సీపీఐ కలిసే పోటీ చేయనున్నాయి. అయితే, ఇక్కడ 20 వార్డులకు గాను సీట్ల కేటాయింపు కొలిక్కిరాలేదు. ఇక మధిరలోనూ కాంగ్రెస్– సీపీఐ మధ్య పొత్తు చర్చల దశలోనే ఉంది.
కలిసే ఎన్నికలకు..
జిల్లాలో ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్–సీపీఎం సమన్వయంతో పోటీ చేశాయి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ కలిసే కొనసాగాలని ఆయా పార్టీలు నిర్ణయించాయి. ఏదులాపురం మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ 23 స్థానాల్లో, సీపీఎం తొమ్మిది స్థానాల్లో పోటీకి అంగీకరించాయి. సత్తుపల్లిలో 23 వార్డులకు గాను ఒక వార్డు సీపీఎంకు కేటాయించారు. మిగిలిన వార్డుల్లో బీఆర్‌ఎస్ పోటీచేయనుంది. కల్లూరులో సీపీఎం– బీఆర్‌ఎస్ మధ్య పొత్తు కుదిరినా సీపీఎంకు ఒక్క వార్డు కూడా కేటాయించలేదు. కూటమి విజయం సాధిస్తే సీపీఎంకు కోఆప్షన్ పదవి ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఇక వైరాలో బీఆర్‌ఎస్ – సీపీఎం కలిసి పోటీ చేస్తున్నా ఎవరెవరికి ఏ వార్డు అనేది ఖరారు కాలేదు. మధిరలో 22 వార్డులకు గాను మూడు వార్డులను సీపీఎంకు కేటాయించారు. మిగిలిన చోట్ల బీఆర్‌ఎస్ అభ్యర్థులు బరిలో నిలుస్తారు.
పార్టీలకు స్థానికంగా ఉన్న బలాల
ఆధారంగానే సీట్ల కేటాయిస్తున్నారు.
బీఆర్‌ఎస్ స్థానికంగా ఉన్న ఓటు బ్యాంక్‌ను దృష్టిలో పెట్టుకుని సీపీఎంతో ముందుకు
సాగుతోంది. మున్సిపాలిటీ స్థాయిలో పొత్తు ఖరారైనప్పటికీ వార్డుల
కేటాయింపులో మాత్రం ఆచితూచి
అడుగులు వేస్తున్నారు. వార్డుల్లో ఆయా పార్టీకి ఓటు బ్యాంక్ ఉంటేనే స్థానాన్ని కేటాయిస్తున్నారు. పార్టీల బలాబలాల
అంచనా కోసం నేతలు అంతర్గత
సర్వే కూడా చేయించినట్లు సమాచారం.
పార్టీల మధ్య ఎడతెగని చర్చలు


