విద్యార్థుల్లో పఠనా సామర్థ్యం పెరగాలి
● అన్ని పాఠశాలల్లో ప్రతిరోజు గంట పాటు ‘ఈసీఆర్’ ● కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ఇంగ్లిష్ పఠనా సామర్థ్యం పెరిగేలా రూపొందించిన ఎవ్రీ చైల్డ్ రీడ్స్(ఈసీఆర్) కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. ఖమ్మంలో భక్తరామదాసు కళాక్షేత్రంలో అదనపు కలెక్టర్ శ్రీజ, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్‌యాదవ్‌తో కలిసి గురువారం ఆయన విద్యాశాఖ అధికారులు, ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎంలో ఈసీఆర్‌పై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ ప్రతిరోజు సాయంత్రం 3నుంచి 4గంటల వరకు ఈసీఆర్ కోసం కేటాయించి విద్యార్థులకు ఆంగ్లం చదవడంపై తర్ఫీదు ఇవ్వాలని తెలిపారు. ఈసీఆర్ ప్రారంభించిన మొదటి వారం నుంచే విద్యార్థుల హాజరు శాతం పెరగగా, పిల్లలకు జీవిత కాలం ఉపయోగపడే సామర్థ్యాలు అందుతున్నాయని చెప్పారు. మొదటిదశ ద్వారా పిల్లల్లో చదివే సామర్థ్యం వచ్చాక, రెండో దశలో వాక్యాలు చదివించడంపై శిక్షణ ఇవ్వాలని సూచించారు. వచ్చే నెలలోగా 75 శాతం విద్యార్థులకు వాక్యాలు చదవడం రావాలని తెలిపారు. నామమాత్రంగా కాకుండా ప్రతీ అక్షరం, వాక్యం శబ్దాల ఆధారంగా శిక్షణ ఇస్తే పిల్లలకు జీవితకాలం గుర్తుంటుందని కలెక్టర్ తెలిపారు. ఈ అంశంపై ప్రతీ బుధవారం విద్యార్థుల ప్రగతిని యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. అనంతరం ఈసీ ఆర్ మొదటి దశ అమలులో ప్రతిభ కనబరిచిన ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలను సన్మానించా రు. రఘునాథపాలెం, బోనకల్ ఎంఈఓలు రాములు, దామాల పుల్లయ్య, కారేపల్లి మండలం గేటుకారేపల్లి ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం వై.రాధ తది తరులు సన్మానం అందుకున్నారు. ఈసమావేశంలో జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఈఓ చైతన్య జైనీ, విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ సీ.హెచ్.రామకృష్ణ, సీఎంఓ ప్రవీణ్, ఆర్‌ఎంఓ ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.


