ఊపందుకున్న నామినేషన్లు
నేడే ఆఖరు..
● రెండో రోజు దాఖలు చేసిన 309 మంది ● అభ్యర్థుల కోసం హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాటు ● నేటితో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలోని సత్తుపల్లి, మధిర, వైరా, ఏదులాపురం, కల్లూరు మున్సిపాలిటీల్లో రెండో రోజు నామినేషన్ల జోరు పెరిగింది. తొలిరోజైన బుధవారం కేవలం ఏడు నామినేషన్లే దాఖలు కాగా, గురువారం మాత్రం ఐదు మున్సిపాలిటీల పరిధి 117 వార్డుల్లో 309 మంది నామినేషన్లు సమర్పించారు. తొలిరోజు ఆశావహులు దూరంగా ఉన్నా, కొన్నిచోట్ల పార్టీల మధ్య పొత్తులు కొలిక్కిరావడం, అభ్యర్థులను ఖరారు చేయడంతో నామినేషన్ల సంఖ్య పెరిగింది. శుక్రవారం చివరి రోజు కావడంతో మిగతా వారు కూడా నామినేషన్లు సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు.
కేంద్రాల వద్ద ఏర్పాట్లు
నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. కేంద్రాల వద్ద హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేయడమే కాక నామినేషన్ పత్రాలు ఇవ్వడం, ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసేలా సిబ్బందిని నియమించారు. కాగా, ఏదులాపురం మున్సిపల్ పరిధిలోని నామినేషన్ కేంద్రాన్ని గురువారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పరిశీలించారు. అలాగే వెంకటగిరిలోని నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను అడిషనల్ డీసీపీ ప్రసాదరావు సందర్శించి బందోబస్తుపై పోలీసులకు సూచనలు చేశారు.
మొత్తం 316
ఐదు మున్సిపాలిటీల పరిధిలో గురువారం 309 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి రోజు దాఖలైన ఏడింటితో కలిపి ఈ సంఖ్య 316కు చేరింది. ఇందులో కాంగ్రెస్ నుంచి 114, బీఆర్‌ఎస్ నుంచి 124, బీజేపీ నుంచి 35, సీపీఎం నుంచి 23 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే స్వతంత్ర అభ్యర్థులు, ఇతర రాష్ట్రాల్లోని గుర్తింపు పొందిన పార్టీల నుంచి 20 నామినేషన్లు అందాయి.
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ స్వీకరణ ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. మూడు రోజులు అవకాశం ఇవ్వడంతో తొలి రెండు రోజులు పొత్తుల్లో స్పష్టత లేకపోవడం, ఇతర కారణాలతో చాలా మంది వేచిచూశారు. ఇక చివరిరోజు మాత్రం పార్టీలు ప్రకటించిన అభ్యర్థులే కాక ఆశావహులంతా నామినేషన్లు వేయనున్నారు. పార్టీల నుంచి జాబితాలు రావడం, సీట్ల సర్దుబాటు చివరి దశకు చేరడంతో నాయకుల సూచనల మేరకు అభ్యర్థులు నామినేషన్ల దాఖలుకు సిద్ధమవుతున్నారు. ఫలితంగా చివరిరోజు నామినేషన్ కేంద్రాల వద్ద రద్దీ నెలకొనే అవకాశం కనిపిస్తోంది.


