ఇకపై బుక్ చేస్తేనే యూరియా
ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు..
● జిల్లాలో మొదలైన ప్రక్రియ ● పలు ప్రాంతాల్లో రైతులకు పంపిణీ
ఖమ్మంవ్యవసాయం: యూరియా విక్రయాల్లో అక్రమాలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం రూపొందించిన ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ అమల్లోకి వచ్చింది. యాప్ ద్వారా జిల్లాలో యూరియా విక్రయాలను గురువారం ప్రారంభించారు. భూమి సర్వే నంబర్, సాగు చేస్తున్న పంట వివరాలు నమోదు చేస్తే అందుకు అవసరమైన యూరియా మాత్రమే సరఫరా చేసేలా యాప్‌ను రూపొందించారు. గడిచిన వానాకాలం సీజన్‌లో యూరియా కొరత ఏర్పడడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. ఈనేపథ్యాన యూరియా పక్కదారి పట్టకుండా చూడడంతో పాటు సరిపడా మాత్రమే కొనుగోలు చేసేలా యాప్‌ను డిసెంబర్ 28వ తేదీనే ప్రారంభించినా సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో పాత విధానాన్ని అమలు చేస్తుండగా, యాప్‌లో లోపాలను సరిచేయడంతో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశాలతో గురువారం నుంచి యాప్ ద్వారా విక్రయాలు మొదలయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ విధానం మొదలుకావాల్సి ఉంది.
ఇంకా 25వేల మె.టన్నులు అవసరం
జిల్లాలో యాసంగి పంటల సాగు లక్ష్యం 4.16 లక్షలు కాగా 70 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. జిల్లాలో ప్రధానంగా వరి, మొక్కజొన్న సాగు చేస్తున్నారు. ఇప్పటికే 45 వేల మెట్రిక్ టన్నుల యూరియా విక్రయించారు. ఇంకా 25వేల మెట్రిక్ టన్నులు అవసరం కాగా, గోదాముల్లో 7వేల మెట్రిక్ టన్నులు, పీఏసీఎస్‌ల్లో 1,200 మె.టన్నులు, ప్రైవేట్ డీలర్ల వద్ద 1,300 మెట్రిక్ టన్నుల యూరియా ఉంది. మిగతా యూరియా దశల వారీగా చేరుతుందని అధికారులు చెబుతున్నారు.
●కామేపల్లి: మండలంలోని కొండాయిగూడెం సొసైటీ వద్ద యాప్‌లో బుక్ చేసుకున్న పలువురు రైతులకు ఏఓ భూక్యా తారాదేవి యూరియా అందజేశారు. ఏఈఓలు భాస్కర్, అశోక్‌రెడ్డి, సొసైటీ సీఈఓ దొడ్డ ముత్తయ్య, సిబ్బంది షేక్ సలీమ్, బోడా రమేష్ పాల్గొన్నారు.
ఇకపై జిల్లాలో యాప్ ద్వారానే యూరియా విక్రయాలు కొనసాగుతాయి. రైతులు పూర్తి వివరాలు నమోదు చేశాక పీఏసీఎస్ లేదా డీలర్‌ను ఎంపిక చేసుకుని ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు. అయితే, 24 గంటల్లోగా యూరియా కొనుగోలు చేయకపోతే ఆ బుకింగ్ రద్దవుతుంది. విక్రయ కేంద్రాల వద్ద ఏఈఓల సహకారం తీసుకోవచ్చు.
– ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయ శాఖాధికారి


