ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం
● ప్రసవాల సంఖ్య మరింత పెంచాలి ● కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మంవైద్యవిభాగం: ప్రభుత్వ ఆస్పత్రులకు నమ్మకంగా వచ్చేవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. వైద్య, ఆరోగ్యశాఖ శాఖలోని వివిధ విభాగాల అధికారులతో కలెక్టరేట్‌లో బుధవారం సమావేశమైన ఆయన మాట్లాడారు. పీహెచ్‌సీల్లో ఉద్యోగుల హాజరును పర్యవేక్షిస్తూ, అనుమతి లేకుండా గైర్హాజరయ్యే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే, వైద్యాధికారులు తమ పరిధిలోని ఆశా కార్యకర్తలతో సమావేశమవుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా కృషి చేయాలని తెలిపారు. అంతేకాక ప్రైవేట్ ఆస్పత్రుల్లో అవసరం లేని ఆపరేషన్లను నిరోధించాలని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరిగే ప్రతీ ఆపరేషన్‌పై నివేదిక ఉండాలని స్పష్టం చేశారు. ఇక పీహెచ్‌సీ పరిధిలో వంద శాతం పిల్లలకు టీకాలు, ఎన్‌సీడీ సర్వే, టీబీ నిర్మూలన, తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ ద్వారా పరీక్షలు, ఎయిడ్స్‌పై అవగాహన, అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు, దత్తత నియమాల అమలుపై కలెక్టర్ సూచనలు చేశారు. అలాగే, మధిరలో కొత్త బ్లడ్ బ్యాంకు ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌ఓ రామారావు, అడిషనల్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు చందునాయక్, వేణుమనోహర్, పీఓలు సుబ్బారావు, బిందుశ్రీ, ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.


