టార్గెట్.. ఫిబ్రవరి
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని మెప్మా పనితీరుపై అధికారులు దృష్టి సారించారు. సీ్త్రనిధి రుణాలు తీసుకుని చెల్లింపులో అలసత్వం వహిస్తున్న సభ్యులు, పర్యవేక్షణలో నిర్లక్ష్యంగా ఉన్న ఆర్పీలపై చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈక్రమంలోనే బుధవారం మెప్మా పీడీ కార్యాలయంలో ఎస్‌ఎల్‌ఎఫ్ పనితీరును సమీక్షించారు. ఆర్థిక సంవత్సరం ముగింపు సమీపిస్తున్న తరుణాన సీ్త్రనిధి రికవరీ శాతాన్ని పెంచాలని నిర్ణయించారు. అయితే సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక లోపాల వల్ల ఆన్‌లైన్ పేమెంట్లలో ఎదురవుతున్న సర్దుబాటు సమస్యలను పరిష్కరించాలని సిబ్బంది కోరినట్లు సమాచారం. అంతేకాక రుణాల వసూళ్లకు సీ్త్రనిధి సిబ్బంది తమతో రావాలని, ప్రత్యేక సిబ్బందిని నియమించుకునే వీలు కల్పించాలని కోరినట్లు తెలిసింది. ఈమేరకు మొండి బకాయిల వసూళ్ల కోసం అవసరమైతే సీ్త్రనిధి సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయికి వెళ్లి ఫిబ్రవరి చివరికల్లా పెండింగ్ లేకుండా చూడాలనే నిర్ణయానికి వచ్చారు. అంతేకాక వలస వెళ్లిన వారు, మృతుల రికవరీల సమస్య పరిష్కారానికి తీర్మానించినట్లు తెలిసింది.
నలుగురిపై ఫిర్యాదు
సంఘం సభ్యులు చెల్లించిన రుణ వాయిదాలను సీ్త్రనిధి ఖాతాల్లో జమ చేయకుండా దుర్వినియోగానికి పాల్పడిన ఆర్పీలపై చర్యలకు ఉపక్రమించినట్లు తెలిసింది. నలుగురు ఆర్పీలు నిధులను వాడుకున్నట్లు అంగీకరించిన నేపథ్యాన వారిపై టూ టౌన్, త్రీ టౌన్ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
సీ్త్రనిధి రుణ బకాయిల వసూళ్లకు ప్రణాళిక


