ప్రశాంతమైన నగరంగా ఖమ్మం
● రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ● రజక భవనానికి శంకుస్థాపన, ఆస్పత్రి భవన ప్రారంభం
ఖమ్మం అర్బన్: ప్రశాంతమైన, పచ్చని, ప్రగతిశీల నగరంగా ఖమ్మాన్ని తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఖమ్మం 36వ డివిజన్‌లో రూ.63 లక్షలతో నిర్మించే రజక భవనానికి మంగళవారం శంకుస్థాపన చేసిన మంత్రి, రూ.2.43 కోట్లతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వీరనారి చాకలి ఐలమ్మ పేరుతో నిర్మిస్తున్న భవనం రజకుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఐలమ్మ పోరాట పటిమ అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కాగా, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరిపడా వైద్యులు, సిబ్బందిని నియమించి 12 గంటల పాటు వైద్య సేవలు కొనసాగించాలని అధికారులకు సూచించారు. నగర అభివృద్ధిలో రోడ్ల విస్తరణ కీలక పాత్ర పోషిస్తుందని, జనాభాకు తగినట్లు రోడ్ల విస్తరణ జరిగితేనే వ్యాపారం వృద్ధి చెంది ఆస్తుల విలువ పెరుగుతుందని తెలిపారు. విస్తరణలో భూములు లేదా స్థలాలు కోల్పోయిన వారికి అన్ని విధాలా న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, డీఎంహెచ్‌ఓ రామారావు, ఆర్డీఓ నర్సింహారావు, తహసీల్దార్ సైదులు, కార్పొరేటర్లు పసుమర్తి రాంమోన్‌రావు, కమర్తపు మురళి, శ్రీదేవి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సాధు రమేష్‌రెడ్డి, తుపాకుల యలగొండస్వామి, యర్రం బాలగంగాధర్ తిలక్, వి.నర్సింహారావు, నాగరాజు, మధు, వెంకన్న, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
●రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఖమ్మంలో పర్యటించనున్నారు. ఉదయం 10గంటలకు ఖమ్మం 21వ డివిజన్ చెరువు బజార్‌లో ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.


