దివ్యాంగుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
మహాశివరాత్రి కల్లా
పూర్తిచేయండి
● ఇప్పటివరకు రూ.100 కోట్లు కేటాయించాం ● డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
మధిర: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో దివ్యాంగుల సంక్షేమానికి రూ.100 కోట్ల నిధులు కేటాయించామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. మధిరలో మంగళవారం ఆయన పలువురు దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలను పంపిణీ చేశాక మాట్లాడారు. గత ప్రభుత్వం పదేళ్లలో దివ్యాంగుల సంక్షేమానికి చేయలేని పనులను తాము రెండేళ్లలోనే చేసి చూపించామని చెప్పారు. దివ్యాంగ విద్యార్థులకు ఐపాడ్లు, కంప్యూటర్లు, ట్యాబ్‌లు ఇస్తున్నామని తెలిపారు. దురదృష్టవశాత్తు అంగవైకల్యంతో జన్మించిన వారిని సమాజంలో భాగం చేసుకోవాల్సి న బాధ్యత అందరిపై ఉందన్నారు. రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య మాట్లాడుతూ తెలంగాణలో మాత్రమే అత్యధిక సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మధిరలో పలు అభివృద్ధి పనులకు మంగళవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. తొలుత మధిర మృత్యుంజయ స్వామి ఆలయంలో పూజలు చేసిన ఆయన శివాలయం సమీపాన వైరా నదిపై రూ. 65కోట్లతో నిర్మించే రిటైనింగ్ వాల్, రూ.75 కోట్లతో నిర్మించే వర్షపు నీటి నిర్వహణ పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో వివిధ కార్పొరేషన్ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ శ్రీజ, జిల్లా ఉపాధి కల్పనాధికారి విజేత, తహసీల్దార్ ఆర్.రాంబాబు, మున్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
వైరారూరల్: వచ్చే శివరాత్రి నాటికి అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఆయన స్వగ్రామమైన వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలో జరుగుతున్న శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌తో కలిసి మంగళవారం పరిశీలించారు. ఆలయ సత్రం, కల్యాణ
మండలం, స్నానఘట్టాల పనులను పరిశీలించిన ఆయన ఆశించిన మేర వేగంగా జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మహాశివరాత్రి కల్లా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సర్పంచ్ నూతి వెంకటేశ్వరరావుతో పాటు దొడ్డా పుల్లయ్య, మల్లు రామకృష్ణ, వడ్డ నారాయణరావు, పొట్లపల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


