అటవీ సంరక్షణతోనే గ్రామీణాభివృద్ధి
● ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి ● ‘తెలంగాణ వన జీవనధార’ ప్రాజెక్టు ప్రారంభం
ఖమ్మంవ్యవసాయం: అడవులను రక్షిస్తూ అటవీ ఉత్పత్తుల ఆధారంగా ఏర్పాటయ్యే యూనిట్లను ప్రభుత్వ పథకాలతో అనుసంధానిస్తే స్థానికుల ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యాన రూపొందించిన ‘తెలంగాణ వన జీవనధార’ ప్రాజెక్టును అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్‌తో కలిసి కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. అడవులను రక్షించుకుంటూనే సముదాయాల ఆధారిత జీవనోపాధుల వృద్ధితో పర్యావరణ పరిరక్షణతో పాటే స్థానికులకు స్థిరమైన ఉపాధి లభిస్తుందన్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న ‘తెలంగాణ రైజింగ్’ లక్ష్యాలకు అనుగుణంగా వన సంరక్షణ సమితులను(వీఎస్‌ఎస్) స్వయం ఆధారితంగా తీర్చిదిద్దే ప్రయత్నానికి శ్రీకారం చుట్టడంపై అభినందించారు. డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్ మాట్లాడుతూ అరణ్య సంరక్షణ, సముదాయ ఆదాయాన్ని ఒకే వ్యవస్థతో అనుసంధానించి స్థిరమైన జీవనోపాధి అమలు చేయడమే ప్రాజెక్టు లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వ పథకాల ద్వారా నైపుణ్యాభివృద్ధి, యూనిట్ల స్థాపన, మార్కెట్ అనుసంధానం, సంస్థల భాగస్వామ్యంతో ముందుకు సాగుతామని చెప్పారు. ఇప్పటికే ఉన్న యూనిట్లను కూడా బలోపేతం చేస్తామన్నారు. డీఆర్డీఓ సన్యాసయ్య, గిరిజన సంక్షేమ శాఖ డీడీ విజయక్ష్మి, డీఏఓ పుల్లయ్య, డీపీఓ రాంబాబు, ఎఫ్‌డీఓ మంజుల తదితరులు పాల్గొన్నారు.
డీఎఫ్‌ఓ ఆలోచనల నుంచి...
‘తెలంగాణ రైజింగ్ – 2047’కు అనుగుణంగానే కాక అరణ్యాలపై పెరుగుతున్న ఒత్తిడి తగ్గించడం, ఆక్రమణలను నియంత్రించడం, మానవ–వన్యప్రాణి సంఘర్షణలను నివారించడమే లక్ష్యంగా జిల్లా అటవీ శాఖ ముందడుగు వేసింది. డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్ ఆలోచనల నుంచి ‘తెలంగాణ వన జీవనధార’ ప్రాజెక్టు పురుడు పోసుకుంది. ఈ ప్రాజెక్టును 2026–2030 కాలపరిమితితో రూపొందించగా, ఆపై 2047 వరకు విస్తరించేలా నిర్ణయించారు. వీఎస్‌ఎస్‌లు, ఎస్‌హెచ్‌జీలు, యువజన గ్రూపులు, ఎకో–టూరిజం కమిటీలు ఇందులో కీలకంగా వ్యవహరిస్తాయి. ‘అడవులను నాశనం చేయకుండా అరణ్యాల నుంచే ఆదాయం’ నినాదంతో రూపొందించిన ఈ ప్రాజెక్టు ద్వారా నైపుణ్యాభివద్ధి, యూనిట్ల స్థాపన, మార్కెట్ అనుసంధానం, ప్రభుత్వ–సీఎస్‌ఆర్ భాగస్వామ్యాల ద్వారా ఆర్థికాభిృద్ధికి కృషి చేస్తారు. పైలట్ ప్రాజెక్టుగా సత్తుపల్లి మండలం చంద్రాయిపాలెం, కల్లూరు మండలం గూడూరు, లోకవరం, ఎర్రుపాలెం మండలంలోని గుంటపల్లి–గోపావరం, వెంకటాపురంను ఎంపిక చేశారు. ఆయా ప్రాంతాల్లో అడవిపై ఆధారపడిన వారికి వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లు, ఆటోలు, టెంట్ యూనిట్లు, ప్లేట్ల తయారీ యూనిట్లు మంజూరు చేయడమే కాక ఉన్న యూనిట్లను మార్కెట్‌కు అనుసంధానిస్తారు. ప్రాజెక్టు అమలుకు జిల్లా స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడిగా కలెక్టర్, జిల్లా ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ యూనిట్ కన్వీనర్‌గా డీఎఫ్‌ఓతో పాటు ఎఫ్‌ఆర్‌ఓ నేతృత్వాన రేంజ్ అమలు బృందాలు, వీఎస్‌ఎస్ కమిటీలు పర్యవేక్షిస్తాయి.
అటవీ సంరక్షణతోనే గ్రామీణాభివృద్ధి


