నామినేషన్ వేసేద్దాం.. !
ఆ తర్వాత బీఫామ్ కోసం ప్రయత్నాలు
మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి
సై అంటున్న ఆశావహులు
అభ్యర్థుల ఎంపికపై పార్టీల్లో కసరత్తు
ఉపసంహరణ నాటికి బీ ఫామ్ ఇస్తేనే పార్టీ అభ్యర్థి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: మున్సిపల్ నగారా మోగడంతో పోటీకి సై అంటున్న ఆశావహుల్లో సందడి నెలకొంది. అధికారికంగా ఏ పార్టీ ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించకున్నా.. తొలుత నామినేషన్ వేసి ఆపై బీ ఫామ్ కోసం ప్రయత్నం చేద్దామనే భావనతో పలువురు సిద్ధమవుతున్నారు. నామినేషన్ల దాఖలుకు మూడు రోజుల సమయమే ఇవ్వడంతో అందుకు అవసరమైన అన్ని పత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు.
ఆశావహుల మధ్య పోటాపోటీ
మున్సిపాలిటీల్లోని పలు వార్డుల్లో పోటీకి కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లో ఎక్కువ మంది సిద్ధమవుతున్నారు. ఒక్కో వార్డు నుంచి ముగ్గురు, నలుగురు తామే బరిలో ఉంటామని చెబుతుండడం, ఇంకొన్ని వార్డుల్లో అభ్యర్థుల కొరత ఉండడంతో.. పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. అంతేకాక పొత్తుల ప్రక్రియ కూడా కొలిక్కిరాలేదు. ఐదు మున్సిపాలిటీల్లోని పలు వార్డుల్లో కాంగ్రెస్–సీపీఐ, బీఆర్‌ఎస్–సీపీఎం పొత్తుతో ముందుకెళ్తున్నట్లు చెబుతున్నా చర్చలు తేలలేదు.
బలమైన వారికే...
నామినేషన్ వేసినా పార్టీ నుంచి బీ ఫామ్ అందితేనే ఆ పార్టీ గుర్తు దక్కుతుంది. దీంతో తొలుత నామినేషన్ వేయడానికి ఆశావహులు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆశావహులు ఎక్కువగా ఉండడంతో ఏ వార్డుల్లో ఎవరు పార్టీ అభ్యర్థి అనేది నామినేషన్ల ఉపసంహరణతోనే తేలనుంది. దీంతో తొలుత నామినేషన్ వేద్దాం.. ఆపై చివరివరకు బీఫామ్ కోసం ప్రయత్నాలు చేయాలనే ఆలోచనలో పలువు రు ఉన్నారు. ఇప్పటికే వార్డుల వారీగా బలమైన అభ్యర్థులు ఎవరన్నది కాంగ్రెస్ పార్టీ సర్వే చేయించినట్లు తెలిసింది. ఈ సర్వేల ప్రకారమే అంగ, ఆర్థిక, జనబలం ఉన్న వారికి బీ ఫామ్ ఇవ్వనున్నట్లు సమాచారం. మున్సిపాలిటీల్లోని పలు వార్డుల్లో బీఆర్‌ఎస్ పార్టీ పరిస్థితి కూడా ఇలానే ఉంది. దీంతో బలం ఉందనుకునే వారినే బరిలోకి దింపేలా సిద్ధమవుతోంది. బలం లేని చోట పొత్తుతో కలిసి వచ్చే పార్టీలకు సీట్లు కేటాయించేలా చర్చలు చేస్తోంది.
అంతా వారం లోగానే..
ఈనెల 28(బుధవారం) నుంచి 30వరకు నామినేషన్ల స్వీకరణ, ఆతర్వాత పరిశీలన, అభ్యంతరాలు, ఉపసంహరణల ప్రక్రియ ఉంటుంది. వచ్చే నెల 3వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అప్పటివరకు బీ ఫామ్ ఇచ్చే అవకాశమున్నందున పార్టీలు తేల్చేవరకు అభ్యర్థి ఎవరో వేచి చూడక తప్పదు. మొత్తంగా వారం లోపలే ప్రక్రియ ముగియనుండడంతో పార్టీలకు సవాల్‌గా మారనుంది. ఆశావహులు ఎక్కువ మంది నామినేషన్ వేస్తే.. వీరిలో పార్టీ అభ్యర్థిని తేల్చడం, మిగతా వారిని బుజ్జగించి ఉపసంహరింపజేయడం కత్తిమీద సాములా మారే అవకాశముంది.
కలిసొస్తే ప్రచారం..
షెడ్యూల్ విడుదలైన తెల్లారి నుంచే నామినేషన్ల స్వీకరణ మొదలుకానుండడంతో అభ్యర్థులను ఎంపిక కోసం పార్టీలకు సమయం లేనట్టే. అంతేకాక మూడు రోజులే నామినేషన్లు స్వీకరించనున్నారు. మొదటిరోజే పార్టీ బీ ఫామ్‌తో నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులకు 12 రోజుల పాటు ప్రచారం చేసుకునే అవకాశముంది. అందుకే పార్టీలు కూడా అభ్యర్థులను త్వరగా నిర్ణయించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇదేసమయాన టికెట్ రాని ఆశావహులను నచ్చచెప్పేందుకు కూడా సిద్ధమవుతున్నారు.


