ఖమ్మం.. ఎర్ర గుమ్మమై.. | - | Sakshi
Sakshi News home page

ఖమ్మం.. ఎర్ర గుమ్మమై..

Jan 19 2026 4:35 AM | Updated on Jan 19 2026 4:35 AM

ఖమ్మం

ఖమ్మం.. ఎర్ర గుమ్మమై..

మా అయ్య కమ్యూనిస్టు, మా అన్న కమ్యూనిస్టు

ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి తరలివచ్చిన పార్టీ శ్రేణులు మూడు వైపుల నుంచి ప్రదర్శనగా చేరుకున్న కార్యకర్తలు

సాక్షిప్రతినిధి, ఖమ్మం/ ఖమ్మంమయూరిసెంటర్‌: ఎటుచూసినా ఎర్రని తోరణాలు, ఎర్ర జెండాలు, ఎర్ర చీరలు, చొక్కాలు ధరించిన వలంటీర్లు, పార్టీ శ్రేణులతో ఖమ్మం అరుణ వర్ణాన్ని పులుముకుంది. ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ కళాశాల మైదానంలో ఆదివారం జరిగిన సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ ఉత్సాహంగా సాగింది. వేలాదిమంది పార్టీ శ్రేణులు తరలిరావడంతో వందేళ్ల పండుగ సంబరం అంబరాన్ని అంటింది. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా హాజరై చేసిన ప్రసంగాలు సీపీఐ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపాయి. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, మోదీ, ట్రంప్‌ విధానాలపై వారు ఘాటుగా విమర్శలు సంధించారు. మొత్తంగా సీపీఐ సభ ఆ పార్టీ శ్రేణులను భవిష్యత్‌ పోరాటాలకు కార్యోన్ముఖులను చేసినట్లయింది.

సీఎం, మంత్రులకు ఎర్ర కండువాలు..

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాకిటి శ్రీహరి ఈ సభకు హాజరయ్యారు. వీరికి సీపీఐ అగ్రనాయకత్వం ఎర్రకండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించడంతో పాటు జ్ఞాపికలు అందజేసింది. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా కమ్యూనిస్టులకు కంచుకోట అని ప్రశంసించారు. ‘సీపీఐ నాయకత్వం ఆహ్వానించగానే ఇక్కడి సభకు వచ్చా. ఈ ఖమ్మం గడ్డ మీద సీపీఐ వందేళ్ల ఉత్సవం జరుపుకుంటుండటం అభినందనీయం. తుది శ్వాస అయినా వదులుతాం కానీ పేదల కోసం పోరాడుతూ ఎర్రజెండాను వదలమని కమ్యూనిస్టు మిత్రులు ఇచ్చిన స్ఫూర్తి తీసుకుని మొన్న జరిగిన ఎన్నికల్లో పాశవికంగా వ్యవహరించిన ప్రభుత్వాన్ని పడగొట్టాం’ అని ప్రసంగించారు. కమ్యూనిస్టులను కీర్తిస్తూ సీఎం చేసిన ప్రసంగంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.

సోదరీ సోదరుల్లారా..

సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ముందుగా తెలుగులో ‘సోదరీ..సోదరుల్లారా.. మీ అందరికీ నమస్కారం. తెలుగు స్వల్పమే వచ్చు. నేను ఇంగ్లిష్‌లో మాట్లాడతా’ అంటూ తన ప్రసంగాన్ని ఇంగ్లిష్‌లో కొనసాగించారు. ‘నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధి కామ్రేడ్‌ ఉదయరాజు పాండే ఇక్కడే ఉన్నారు. విదేశీ మిత్రులు కూడా ఈ వేదికపై ఉన్నారు. ఇది ఒక చరిత్రాత్మక సందర్భం. మన సందేశం వారికి తెలిసేలా నేను ఇంగ్లిష్‌లోనే మాట్లాడతా.’ అని తనదైన శైలిలో మోదీ ప్రభుత్వంపై విమర్శల ఘాటెక్కించారు.

ఎర్రెర్రన్ని దారులై..

నగరంలో వీధులన్నీ ఎరుపు రంగు పులుముకున్నాయి. సీపీఐ కార్యకర్తలు, జనసేవాదళ్‌ కవాతుతో నగర వీధులన్నీ కిటకిటలాడాయి. ప్రతి ఒక్కరూ జెండాలు చేబూని ప్రదర్శనలో పాల్గొన్నారు. నాగపూర్‌, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ తదితర రాష్ట్రాల నుంచి కమ్యూనిస్టు కార్యకర్తలు ఈ సభకు హాజరయ్యారు. సభకు ముందు ప్రజానాట్యమండలి కళాకారులు ఆలపించిన పాటలు ఆకట్టుకున్నాయి. ఇల్లెందు క్రాస్‌, ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ కళాశాల చుట్టూ ఉన్న దారులన్నీ ఎరుపెక్కాయి.

మూడు దిశల నుంచి ప్రదర్శన

సభకు ముందు నగరంలో మూడు వైపుల నుంచి ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. పెవిలియన్‌ గ్రౌండ్‌ నుంచి మొదలైన ప్రదర్శన రెండు కిలోమీటర్ల మేర సాగింది. ఇందులో మహిళలు బతుకమ్మలతో ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, సీపీఐ అగ్ర నేతలు పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు, గుజ్జుల ఈశ్వరయ్య, చాడ వెంకటరెడ్డి, నెల్లికంటి సత్యం, బాగం హేమంతరావు తదితరులు నాయకత్వం వహించారు. కార్యకర్తలు, సింగరేణి కార్మికులు, కోయ, లంబాడ, జానపద నృత్య కళాకారులు, డప్పు కళాకారులు ప్రదర్శనలో పాల్గొన్నారు. ఖమ్మం నయాబజార్‌ కళాశాల నుంచి మరో ప్రదర్శన మయూరిసెంటర్‌, జెడ్పీ సెంటర్‌, ఇల్లెందు క్రాస్‌ రోడ్డు మీదుగా సభాస్థలికి చేరుకుంది. ఈ ప్రదర్శనకు రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, బోస్‌, కె.శంకర్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్‌ నేతృత్వం వహించారు. మూడో ప్రదర్శన శ్రీశ్రీ విగ్రహం నుంచి ప్రారంభమై రోటరీ నగర్‌, మమత రోడ్డు, ఇల్లెందు క్రాస్‌ రోడ్డు మీదుగా సభా స్థలికి చేరుకుంది. ఈ ర్యాలీకి పార్టీ జాతీయ సమితి సభ్యులు ఎస్‌.కే.సాబీర్‌పాషా, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్‌రెడ్డి తదితరులు నేతృత్వం వహించారు. ముగింపు సభలో సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు అమర్‌జిత్‌ కౌర్‌, గిరిశర్మ, అనిరాజ, ప్రకాష్‌బాబు, సంతోష్‌బాబు, పల్లా వెంకటరెడ్డి, బినయ్‌ విశ్వం, రామకృష్ణ పాండ, కె.రామకృష్ణ, కుల్‌దేవ్‌, జాతీయ కంట్రోల్‌ కమిషన్‌ చైర్మన్‌ కె.నారాయణ, ఏపీ రాష్ట్ర కార్యదర్శి జి.ఇస్రాయల్‌, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, సీపీఐ సీనియర్‌ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, మీడియా అకాడమీ చైర్మన్‌ కె.శ్రీనివాసరెడ్డి, నేతలు బాగం హేమంతరావు, దండి సురేష్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీపీఐ కార్యదర్శి సాబీర్‌పాషా, కార్పొరేటర్‌ బి.జి.క్లెమెంట్‌ తదితరులు పాల్గొన్నారు.

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌

‘నేను కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేనే అయినా.. నా కుటుంబం అంతా కమ్యూనిస్టులే’ అని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌ అన్నారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాల సభకు హాజరైన ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్టు జెండా ఎప్పటికై నా ఉండాల్సిందేనని.. శ్రమజీవులు, దోపిడీ రాజ్యం, మతోన్మాద శక్తులు ఉన్నంత వరకు ఎర్ర జెండా ఎగురుతూనే ఉండాలని అన్నారు. ‘మా అయ్య కమ్యూనిస్టు, మా అన్న కమ్యూనిస్టు, మా గడ్డ వీరగడ్డ, మా నల్ల గొండ కమ్యూనిస్టుల అడ్డా’ అని పేర్కొన్నారు. ఈ కారణంగా తాను సభలో పాల్గొనేందుకు వచ్చానని తెలిపారు. ‘సీఎం రేవంత్‌ రెడ్డి కూడా మనకు తెలవని విప్లవకారుడు, మనకు తెలవకుండానే ఆయనలో తొక్కిపెడుతున్న విప్లవం ఉంది’ అని తెలిపారు. అందుకోసమే ఇవాళ సాంబశివరావు సీఎంను అతిథిగా పిలిచారని పేర్కొన్నారు.

ఉత్సాహంగా సీపీఐ వందేళ్ల పండుగ సభ

ఖమ్మం.. ఎర్ర గుమ్మమై..1
1/2

ఖమ్మం.. ఎర్ర గుమ్మమై..

ఖమ్మం.. ఎర్ర గుమ్మమై..2
2/2

ఖమ్మం.. ఎర్ర గుమ్మమై..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement