ఐక్యతతోనే ఎరజ్రెండా రెపరెపలు
● సీపీఐ, సీపీఎం కలిస్తే మిగతా వారూ కలిసే అవకాశం ● వందేళ్ల సందర్భంగా పునరాలోచన చేసుకుందాం ● పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని పిలుపు
దేశంలో వామపక్షాల ఐక్యతతోనే ఎర్ర జెండా ఎగిరే అవకాశాలు ఉన్నందున ఐక్యత కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉందామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ ఐక్యత లేకపోతే పలు రకాలుగా మానవ హననం చేస్తున్నారని అన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రప్రభుత్వం, నరేంద్ర మోడీ దాడులు చేస్తున్నారని.. దీనికి పరిష్కారంగా ప్రజలు కమ్యూనిస్టుల ఐక్యతను కోరుకుంటున్నారని తెలిపారు. ఎర్రజెండాలు అన్నీ కలిసి ఒక జెండాగా రావాలని, విడిపోతే దేశానికి మంచి జరగదని అన్నారు. ప్రజల కోరికను అంగీకరించేలా వందేళ్ల సందర్భంగా పునరాలోచన చేసుకుందామని పిలుపునిచ్చారు. చిన్న చిన్న అభిప్రాయాలు, సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నా పరిష్కారం చేసుకుందామన్నారు. మావోయిస్టు సోదరులే కొంచెం డిఫరెంట్ ఎజెండాతో ఉన్నారని, వారు కూడా ఆలోచన చేయాలని కోరారు. సీపీఐ, సీపీఎం ముందు కలిస్తే మిగిలిన అన్ని కమ్యూనిస్టు పార్టీలు కూడా కలవడానికి అవకాశం ఉంటుందని కూనంనేని పేర్కొన్నారు. వందేళ్ల సంబరాన్ని చూసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అంతా సీఎం రేవంత్‌రెడ్డిని ఎందుకు పిలిచారని ప్రశ్నిస్తున్నారని.. కాంగ్రెస్ ఇండియన్ బ్లాక్‌లో ఉండడమే కాక.. అన్నింటికి మించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన సొంత తమ్ముడిలా ఉండడంతో అభిమానంగా పిలిచామని వెల్లడించారు.
వెనిజువెలాను తిరిగి సాధించుకోవాలి..
వెనిజువెలా దేశంపై పడి బందిపోట్లు దోచుకెళ్లినట్లుగా ఆ దేశ అధ్యక్షుడు, ఆయన భార్యను అమెరికా ఎత్తుకెళ్లిందని కూనంనేని పేర్కొన్నారు. ఈ సభా వేదికపై నుంచి వెనిజువెలాకు సంఘీభావం తెలుపుతున్నామని చెప్పారు. ఆ దేశంపై అమెరికా చేస్తున్న దాడికి నిరసనగా పోరాటాలు సాగిస్తున్నామని పేర్కొన్నారు. వెనిజువెలాను తిరిగి సాధించుకుని, ఆ దేశ అధ్యక్షుడు, ఆయన సతీమణిని తిరిగి వెనక్కి పంపించే వరకు అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందని కూనంనేని తెలిపారు.


