ఇక్కడి నుంచే.. నా రాజకీయ ప్రయాణం | - | Sakshi
Sakshi News home page

ఇక్కడి నుంచే.. నా రాజకీయ ప్రయాణం

Jan 19 2026 4:35 AM | Updated on Jan 19 2026 4:35 AM

ఇక్కడ

ఇక్కడి నుంచే.. నా రాజకీయ ప్రయాణం

2007 – 08లో తొలిసారి మధిరలో ‘పల్లెపల్లెకు టీడీపీ’ కార్యక్రమానికి వచ్చా

నాటి నుంచి నేటి వరకు

నన్ను ఖమ్మం ఆశీర్వదిస్తోంది

గత మూడు ఎన్నికల్లో కాంగ్రెస్‌ను

గుండెల్లో పెట్టుకున్నారు..

జీపీల్లో మాదిరే మున్సిపల్స్‌లోనూ బీఆర్‌ఎస్‌ను బొందపెట్టాలి

కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మడి జిల్లా

మున్సిపల్‌ ఎన్నికల సన్నాహక

సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘మొదటిసారి నా రాజకీయ ప్రయాణం ఖమ్మం జిల్లా నుంచే మొదలైంది. 2007 – 08లో ‘పల్లెపల్లెకు తెలుగుదేశం’ కార్యక్రమంలో భాగంగా నాడు కొండబాల కోటేశ్వరరావుతో కలిసి మధిర నియోజకవర్గంలో తిరిగా. మా కుటుంబానికి అత్యంత సన్నిహితులు మల్లు అనంతరాములు, మిత్రుడు మల్లు భట్టి విక్రమార్క సొంత ఊరు స్నానాల లక్ష్మీపురం వెళ్లా. ఆరోజు శాసనమండలి సభ్యుడిగా ఇక్కడికి వచ్చా. నాటి నుంచి నేటి వరకు ఖమ్మం జిల్లాకు ఎప్పుడు వచ్చినా నిండు మనసుతో నన్ను ఉమ్మడి జిల్లా ప్రజలు ఆశీర్వదించారు. ఈరోజు ముఖ్యమంత్రిగా ఎదగడానికి మీ అండదండలు ఉన్నాయి’. అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పాలేరు నియోజకవర్గంలోని ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి మద్దులపల్లి వద్ద జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాల, కూసుమంచిలో 100 పడకల ఆస్పత్రి, మున్నేరు పాలేరు లింక్‌ కెనాల్‌ శంకుస్థాపన, నర్సింగ్‌ కళాశాల, మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్‌ ప్రారంభ పైలాన్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మద్దులపల్లి సమీపాన జరిగిన కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మడి జిల్లా మున్సిపల్‌ ఎన్నికల సన్నాహక సమావేశంలో సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..

ఇక్కడి ప్రజలు పోరాటానికి ప్రతిరూపం

ఖమ్మం జిల్లా ప్రజలు తెలివైనోళ్లు, పోరాటానికి ప్రతినిధులు. 2014, 2018, 2023లో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటే ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీకి ఈ మూడు ఎన్నికల్లోనూ ఉమ్మడి జిల్లా అండగా నిలిచింది. ఇటీవల సర్పంచ్‌ ఎన్నికల్లోనూ 1,130 గ్రామపంచాయతీలు ఉంటే 71శాతంగా 791 గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్‌ పార్టీకి విజయాన్ని ఇచ్చారు. కాంగ్రెస్‌కు ఖమ్మం కంచుకోట అని నిరూపించిన కార్యకర్తలకు మనస్ఫూర్తిగా అభినందనలు చెబుతున్నా. రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లోనూ మీ రక్తాన్ని చెమటగా మార్చి కాంగ్రెస్‌ జెండా ఎగురవేయాలి. పార్టీ జిల్లా, రాష్ట్ర అధ్యక్షులు బీ ఫామ్‌ ఇచ్చిన వారి గెలుపు కోసం పనిచేయాలి. భిన్నాభిప్రాయాలు ఉన్నా అవి విభేదాలుగా మారొద్దు. కొన్నిసార్లు అవకాశం ఆలస్యంగా వస్తే.. మరికొన్నిసార్లు అదృష్టం కలిసి వస్తుంది.

వారిని నమ్మొద్దు..

జిల్లాలో బీజేపీ ఆనవాళ్లు కూడా లేవు. ఏకలింగం, బోడిలింగం తోకలు కూడా ఖమ్మంలోకి రాలేదు. రాజ్యాంగానికే ప్రమాదం ఉందని మొదటి నుంచీ ఈ జిల్లాలో బీజేపీని నిషేధించారు. ఆ నిషేధం భవిష్యత్‌లోనూ కొనసాగుతుందని విశ్వసిస్తున్నా. కాకపోతే మారీచులు మళ్లీ బయలుదేరారు. శివరాసన్‌ ఇక్కడ మీటింగ్‌ పెట్టాడు. ఖమ్మంలో శివరాసన్‌ మాటలు నమ్మొద్దు. మారీచుడి వేషంలో వచ్చిన ఆయన మాటలు విశ్వసించొద్దు.

రామయ్య సన్నిధిలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకం

రాష్ట్రంలోనే తొలిసారి భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించుకున్నాం. నాడు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గృహనిర్మాణశాఖను రద్దు చేస్తే మేము పునరుద్ధరించాం. మీ అభిమాన నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటి ఏడాదిలోనే రాష్ట్రంలో 4.50లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చారు. గృహప్రవేశాలు ఇక్కడే చేసి పేదల కళ్లల్లో ఆనందం చూశా. ఓ గిరిజనుడి ఇంట్లో ప్రభుత్వం ఇచ్చే సన్న బియ్యంతో వండించుకుని తిన్నా. పొంగులేటి వల్లే ఇవ్వాళ పాలేరుకు మున్నేరు – పాలేరు లింక్‌ కెనాల్‌ ప్రాజెక్టును తెచ్చుకోగలిగాం. నర్సింగ్‌ కాలేజీ, జేఎన్‌టీయూ కాలేజీ ఇచ్చుకున్నాం. ఉమ్మడి జిల్లాకు సీతారామ వరప్రదాయిని అవుతుంది.

రాముడినీ కేసీఆర్‌ మోసం చేశాడు..

భద్రాచలం రామాలయానికి రూ.100 కోట్లు ఇస్తానని చెప్పిన కేసీఆర్‌ ఒక్క రూపాయి ఇవ్వకుండా రాముడిని కూడా మోసం చేశాడు. ఇవ్వాళ మా ప్రభుత్వంలో దేవాలయాన్ని విస్తరించేందుకు భూసేకరణ చేపట్టాం. త్వరలోనే అయోధ్య రామమందిరాన్ని తలపించేలా నిర్మించుకుందాం. ఇందుకు అవసరమైన నిధులను విడుదల చేసే బాధ్యత మాపై ఉంది.

ఆ మూడు

మండలాలకు కూడా నీళ్లు ఇచ్చేలా..

మున్నేరు వాగుపై చెక్‌డ్యామ్‌ కడితే ఇల్లెందు నియోజకవర్గంలోని మూడు మండలాలకు నీళ్లు వస్తాయని, అదంతా కరువు ప్రాంతమైనందున ఆలోచన చేయాలంటూ ఎమ్మెల్యే కోరం కనకయ్య మా దృష్టికి తెచ్చారు. దీనిని పరిశీలించి సాధ్యమైతే తక్షణమే మంజూరు చేయించే బాధ్యత తీసుకుంటాం. మున్సిపాలిటీల్లో చాలా సమస్యలు ఉన్నాయి. వీటన్నింటినీ అభివృద్ధి చేసుకోవాలి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాతే కొత్తగూడెం కార్పొరేషన్‌ చేశాం. అర్హులైన పేదలందరికీ రేషన్‌కార్డులు ఇవ్వడంతోపాటు సన్నబియ్యం అందించాలి.

ఇంకా ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం, నాగర్‌కర్నూల్‌ ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి, మల్లు రవి, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు వేంనరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, రాందాస్‌ నాయక్‌, మట్టా రాగమయి, జారె ఆదినారాయణ, తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, కార్పొరేషన్ల చైర్మన్లు మువ్వా విజయ్‌బాబు, రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కాంగ్రెస్‌ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్‌, తోట దేవీప్రసన్న, నేతలు పొంగులేటి ప్రసాదరెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, కొండబాల కోటేశ్వరరావు, నాగండ్ల దీపక్‌చౌదరి, తుమ్మల యుగంధర్‌, చరణ్‌రెడ్డి, తుంబూ రు దయాకర్‌రెడ్డి, భైరు హరినాధ్‌బాబు, బండి జగదీష్‌, చెన్నబోయిన వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.

అభివాదం చేస్తున్న సీఎం రేవంత్‌

ఇక్కడి నుంచే.. నా రాజకీయ ప్రయాణం1
1/2

ఇక్కడి నుంచే.. నా రాజకీయ ప్రయాణం

ఇక్కడి నుంచే.. నా రాజకీయ ప్రయాణం2
2/2

ఇక్కడి నుంచే.. నా రాజకీయ ప్రయాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement