విద్య, వైద్య రంగాలను బలోపేతం చేస్తున్నాం
● విదేశాల్లో నర్సింగ్ వృత్తికి డిమాండ్ ఉంది ● అందుకే కళాశాలల్లో జపనీస్, జర్మనీ భాష నేర్పిస్తున్నాం ● నర్సింగ్ కాలేజీ విద్యార్థులతో సీఎం రేవంత్‌రెడ్డి ముఖాముఖి
ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇస్తోంది. సమాజంలో ఈ రెండు రంగాలకు మొదటి ప్రాధాన్యత ఉన్నందున బలోపేతం చేస్తున్నాం’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. పాలేరు నియోజకవర్గం మద్దులపల్లిలో రూ.362 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి మద్దులపల్లి వద్ద జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాల, కూసుమంచి మండలంలో వంద పడకల ఆస్పత్రి, మున్నేరు–పాలేరు లింక్ కెనాల్‌కు శంకుస్థాపన, నర్సింగ్ కళాశాల, మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ భవనాల ప్రారంభోత్సవ పైలాన్‌లను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నర్సింగ్ కళాశశాలలో విద్యార్థులతో ముఖాముఖిగా సీఎం మాట్లాడారు. ఆ వివరాలు సీఎం మాటల్లోనే...
వృత్తిలో నిర్లక్ష్యం వద్దు..
బీఎస్సీ నర్సింగ్‌లో చేరిన విద్యార్థినులకు అభినందనలు. ఎవరికై నా ఆరోగ్యం బాగోలేనప్పుడు ముందుగా వచ్చేది వైద్యుల వద్దకే. దేవుడిపై ఎంత నమ్మకం ఉంటుందో.. వైద్యుడిపై కూడా అంతే ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు, ఇష్టాయిష్టాలు ఉండొచ్చు. వాటిని వృత్తిగత జీవితంలో చూపించొద్దు. రోగులకు సేవలు అందించడంపైనే దృష్టి సారించాలి. సహనంతో సేవ చేయాలి.
విదేశాల్లో కూడా నర్సింగ్ విద్యార్థులకు అవకాశం ఉంది. ఇంజనీరింగ్ విద్యార్థులకు అమెరికా వెళ్లాలనే లక్ష్యం ఉంటుంది. మెడికల్ ప్రపంచంలో కూడా విదేశాల్లో అవకాశాలు ఎదురు చూస్తున్నాయి. నేను జపాన్, జర్మనీ, దక్షిణ కొరియాల్లో పర్యటించినప్పుడు అక్కడ నర్సింగ్ విద్యార్థులకు డిమాండ్ ఉన్నట్లు గమనించా. ఇంజనీరింగ్ విద్యార్థుల కన్నా నర్సులకు ఎక్కువ జీతభత్యాలు ఉండే పరిస్థితి ఆ దేశాల్లో ఉంది. ఆయా దేశాలతో మేము ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం. తద్వారా మన విద్యార్థులకు అక్కడ అవకాశాలు పెరగనున్నందున నర్సింగ్ కళాశాలల్లో జపనీస్, జర్మనీ భాషలను నేర్పిస్తున్నాం. మద్దులపల్లిలోని నర్సింగ్ కళాశాలలో కూడా ఈ భాషలను నేర్పించేందుకు చర్యలు తీసుకుంటాం.


