
పత్తిని దెబ్బతీసిన వాన
● అధిక వర్షాలతో చేలలో నిలిచిన నీరు ● సమగ్ర పోషకాలు అందక పూత, కాత దశలో ఎర్రబారిన చేన్లు
ఖమ్మంవ్యవసాయం/వైరా రూరల్: ఇటీవల విస్తారంగా కురిసిన వర్షాలు పత్తి పంటకు ప్రతికూలంగా మారాయి. అధిక వర్షాలతో చేలలో నీరు నిలిచి రోజుల తరబడి నిల్వ ఉండడంతో పైరు స్థితి మారుతోంది. తేమ కారణంగా సమగ్ర పోషకాలు అందక ఎర్రబారడమే కాక పూత, కాత రాలిపోయాయి. ఫలితంగా దిగుబడి తగ్గే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మిర్చికి ఆశించిన ధర లేక ఈ ఏడాది రైతులు పత్తి సాగుకు ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో జిల్లా సాధారణ విస్తీర్ణం 2.15 లక్షల ఎకరాలైతే 2,25,022 ఎకరాల్లో సాగైంది. అత్యధికంగా కారేపల్లి మండలంలో 22,934 ఎకరాల్లో, రఘునాథపాలెంలో 22,179, చింతకాని మండలంలో 20,181 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. కనిష్టంగా సత్తుపల్లి మండలంలో కేవలం 215 ఎకరాల్లో పత్తి సాగైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.
పది రోజుల పాటు వాన
పత్తిని మెట్ట పంటగా సాగు చేస్తారు. కొందరు వర్షాదారంగా, ఇంకొందరు నీటి వనరులు ఉన్న భూముల్లోనూ సాగు చేశారు. ఈ ఏడాది మే చివరి వారంలో కురిసిన వానలతో విత్తనాలు నాటారు. ఆపై జూన్‌లో సాధారణ వర్షపాతం కూడా లేకపోగా, జూలైలో సాధారణానికి మించి, ఈనెలలో పది రోజుల పాటు వర్షాలు కురిశాయి. పత్తి పూత, కాత దశకు చేరిన సమయంలో కరిసిన వర్షాలు పంటపై ప్రభావాన్ని చూపాయి. రోజుల తరబడి చేన్లలో నీరు నిలిచి తేమ పెరగగా పత్తికి సమగ్ర పోషకాలు అందక మొక్కలు ఎర్రబారాయి. అంతేగాక రసం పీల్చే పురుగు ఆశిస్తోంది. ఇదికాక వర్షం కారణంగా కలుపు విపరీతంగా పెరగడం రైతులను ఆవేదనకు గురిచేస్తోంది.
దిగుబడిపై ప్రభావం
అధిక వర్షాలు పంట దిగుబడిపై ప్రభావం చూపే పరిస్థితి కనిపిస్తోంది. చాలాచోట్ల పూత, కాత రాలిపోగా దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక పల్లపు నేలల్లో పత్తి బాగా దెబ్బతిన్నదని, దిగుబడులపై ఆశ లేనట్టేనని చెబుతున్నారు. సహజంగా ఎకరాకు 10 – 12 క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి ఆరు క్వింటాళ్లు రావడం కూడా కష్టమేనని ఆవేదన దుతున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
●వర్షపునీటినికాల్వల ద్వారా బయటకు పంపించాలి.
●ఎకరాకు 20 కిలోల యూరియా, 15 కిలోల ఎంఓపీ(మ్యూరేట్ ఆఫ్ పొటాష్) వేస్తే నైట్రోజన్, పొటాష్ కొరత తీరుతుంది.
●యూరియా(2శాతం) లేదా మల్టీ కే (ఒక శాతం) ద్రావణం పిచికారీ చేస్తే మొక్కకు త్వరగా పోషకాలు అందుతాయి.
●కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లేదా ఒక గ్రాము కార్బాండిజం, 25 గ్రాముల మాంకోజెబ్‌ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
●వడల తెగులు గమనిస్తే కాపర్ ఆక్సీ క్లోరైడ్ మూడు గ్రాములను లీటరు నీటిలో కలిపి మొక్క మొదళ్లు తడిచేలా పోయాలి.
●రసం పీల్చే పురుగు నివారణకు పిప్రొనిల్ లేదా ఎసిటామిప్రిడ్ మందు పిచికారీ చేయాలి.