
జ్వరబాధిత విద్యార్థులు ఇంటికి..
సత్తుపల్లి: సత్తుపల్లిలోని మైనార్టీ గురుకులంలో జ్వరాల బారిన పడిన విద్యార్థులను శనివారం ఇళ్లకు పంపించారు. తొలుత గంగారం పీహెచ్‌సీ వైద్యాధికారి ఆర్.అవినాష్ ఆధ్వర్యాన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. జలుబు, దగ్గుతో పలువు రు బాధపడుతుండగా మందులు అందజేశారు. ఆపై తల్లిదండ్రులతో ఇళ్లకు పంపించారు. అయితే, వర్షాకాలం సీజన్‌లో దోమలు, ఆపై వ్యాధులు ప్రబలే అవకాశమండగా, గురుకులంలోని కొన్ని గదుల కిటికీల మెష్‌లు తొలగించారు. దీంతో దోమల బెడద పెరిగినట్లు తెలుస్తోంది. కాగా, కల్లూరు డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ టి.సీతారాం పాఠశాలలో వైద్యశిబిరాన్ని పరిశీలించారు. అలాగే, పారిశుద్ధ్యం, డైనింగ్‌హాల్, తాగునీటి సరఫరా, వంట గదులను తనిఖీ చేశారు. పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి సారించడమే కాక వేడి ఆహారాన్ని అందించాలని సూచించారు. పాఠశాల ప్రిన్సిపాల్ వెంకట్రామయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రిజర్వేషన్ ప్రకారం
పదోన్నతులు ఇవ్వాలి
ఖమ్మం సహకారనగర్: రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఉపాధ్యాయ పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని టీజీటీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఇస్లావత్ లక్ష్మణ్‌నాయక్, వ్యవస్థాపక అధ్యక్షుడు మాలోతు రామారావు డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం కలెక్టరేట్ వద్ద సంఘం నాయకులతో కలిసి నిరసన తెలిపాక అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జనరల్ రోస్టర్‌లో పదోన్నతులు పొందిన ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ, ఉపాధ్యాయులను కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ కోటా కింద లెక్కించడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏ.బన్సీలాల్, బి.జగ్గి లాల్‌తో పాటు బాబురావు, ఈర్యా, రవికుమార్, శంకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.