
పొలంలో రైతు మృతి
కూసుమంచి: పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన అక్కడే మృతి చెందిన ఘట న శనివారం మండలంలోని పాలేరులో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యడవెల్లి వీరభద్రారెడ్డి(52) పొలానికి నీళ్లు పెట్టేందుకు ఉదయమే ఇంటి నుంచి వెళ్లాడు. ఎంతకూ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెళ్లి చూడగా మోటారు వద్ద మృతదేహం పడి ఉంది. వీరభద్రారెడ్డి గుండెపోటుతో మృతిచెందాడని భావిస్తుండగా, ఆయన కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్పై నాగరాజు తెలిపారు.
చికిత్స పొందుతున్న
వృద్ధురాలు మృతి
తల్లాడ: తల్లాడ ఎన్టీఆర్‌నగర్ సమీపాన ఈనెల 20న జరిగిన రోడ్డుప్రమాదంలో గాయపడిన గుర్తుతెలియని యాచకురాలు చికిత్స పొందుతూ శనివా రం మృతిచెందింది. మండలంలోని గాంధీనగర్ తండా వైపు నుంచి తల్లాడ వైపు వృద్ధురాలు నడిచి వస్తుండగా.. వెంగన్నపేటకు చెందిన జినుగు వెంకటి బైక్‌పై వెళ్తూ ఢీ కొట్టాడు. ఈఘటనలో గాయపడిన ఆమెను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందిందని తల్లాడ రెండో ఎస్‌ఐ వెంకటేశ్ తెలిపారు.
స్థల వివాదంతో
సోదరి ఇంటిపై దాడి
ఖమ్మంఅర్బన్: స్థల వివాదం కారణంగా వివాహిత ఇంటిపై దాడి చేసిన ఆమె సోదరుడు, ఆయన కుమారుడిపై శనివారం ఖమ్మం అర్బన్(ఖానా పురం హవేలీ) పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లీపురంలో ప్రమీల, ఆమె సోదరుడు జి.శ్రీను వేర్వేరుగా నివసిస్తున్నారు. గతంలో శ్రీను ఓ కేసులో జైలుకు వెళ్తే బెయిల్ కోసం ప్రమీల రూ.2 లక్షలు ఇచ్చింది. దీనికి ప్రతిఫలంగా ఆయన పేరిట ఉన్న ఇంటి స్థలాన్ని రాశాడు. కానీ ఇప్పుడు స్థలం విలువ పెరగడంతో శ్రీను మళ్లీ తనకే కావాలని పేచీ పెడుతున్నాడు. ఈక్రమంలోనే శ్రీను, ఆయన కొడుకు రాజరత్నం కలిసి శనివారం ప్రమీల ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఆమె ఫిర్యాదుతో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.