
‘భగీరథ’ కార్మికుల సమ్మె విరమణ
కూసుమంచి/వైరా: నాలుగు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలనే డిమాండ్‌తో మిషన్ భగీరథ కార్మికులు జిల్లా వ్యాప్తంగా శనివారం సమ్మెకు దిగారు. ఇందులో భాగంగానే కూసుమంచి మండలంలోని పాలేరు, వైరా రిజర్వాయర్ సమీపాన సబ్‌స్టేషన్ వద్ద కార్మికులు ఆందోళన చేపట్టారు. వైరాలో కార్మికులు మూడు గంటల పాటు ఆందోళన చేపట్టగా భగీరథ సీఈ శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్మికులందరికీ నాలుగు నెలల వేతనాలను విడతల వారీగా వచ్చేనెల 15లోగా జమ చేస్తామని హామీ ఇచ్చారు. దీనికితోడు జేఏసీ నాయకులతో అధికారులు జరిపిన చర్చలు సఫలం కావటంతో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కార్మికులు విధులకు హాజరై నీటి సరఫరాను పునరుద్ధరించారు. ఆందోళనలో బీఆర్‌టీయూ ఐఎన్‌టీయూసీ, సీఐటీయూ నాయకులు రవి, రాములు, అనంతరాములు, బాలకృష్ణ, రాంబాబు, వెంకయ్య పాల్గొన్నారు.