
ఆక్రమిత స్థలాల స్వాధీనం
మధిర: మధిర మున్సిపాలిటీ పరిధిలోనిని హిందూ శ్మశాన వాటిక స్థలంతోపాటు ప్రభుత్వ డొంకలో ఆక్రమణకు గురైన ఖాళీ స్థలాలను రెవెన్యూ అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. సర్వేనెంబర్ 425, 427, 429, 430లోని డొంక స్థలం, 424 సర్వే నంబర్‌లోనిహిందూ శ్మశాన వాటిక కొంత మేర ఆక్రమణకు గురికాగా సర్వే అనంతరం స్వాధీనం చేసుకుని మున్సిపాలిటీకి అప్పగించారు. ప్రభుత్వ డొంకలోఆరుగురు 3,245 గజాలను, శ్మశాన వాటికలో ఐదుగురు 2,158 గజాల ఖాళీ స్థలాన్ని ఆక్రమించినట్లు తేల్చారు. అలాగే, శ్మశాన వాటికలోని కొంత స్థలాన్ని ఆక్రమించుకుని నివసిస్తున్న పేదలకు బీపీఎల్ కోటాలో రెగ్యులరైజేషన్‌కు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక ఓ పాఠశాల యజమాని ప్రభుత్వ డొంకలో 2,040 గజాలు, శ్మశాన వాటికలో 370 గజాలు, మరో పాఠశాల యజమాని 705 గజాల స్థలాన్ని ఆక్రమించినట్లు తేల్చగా, ఇంకో కాంట్రాక్టర్ 450 గజాల స్థలాన్ని ఆక్రమించి ఇళ్లు నిర్మించినట్లు గుర్తించారు. ఈమేరకు ఆక్రమణదారులకు నోటీసులు ఇవ్వనున్నట్లు తహసీల్దార్ తెలిపారు. అయితే, వారు కోర్టుకు వెళ్లగా అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించారు.