
డేంజర్.. యమడేంజర్
జిల్లాలో 43 బ్లాక్‌స్పాట్లు గుర్తించిన పోలీసు అధికారులు అన్ని శాఖల సమన్వయంతో నియంత్రణ చర్యలకు శ్రీకారం బారికేడ్లు, సూచిక బోర్డులు, స్టాపర్లు, సిగ్నల్ లైట్ల ఏర్పాటు
హడలెత్తిస్తున్న రద్దీ, వేగం
రోడ్లపై వాహనాల రద్దీకి తోడు పలువురు వాహనదారులు విపరీతమైన వేగంగా వెళ్తుండడం.. రహదారులపై గుంతలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. జాతీయ, రాష్ట్రీయ, ఇతర ప్రధాన రహదారులపై ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగింది. హైవేలపై నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తుండడం, కొందరు మద్యం మత్తులో వాహనాలు నడుపుతుండడం ప్రమాదాలకు కారణమవుతోంది. వీటికి తోడు మూలమలుపులు, గుంతలు పడిన చోట ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. ఇక ఎక్కడైనా వాహనాలు బ్రేక్ డౌన్ అయినప్పుడు రాత్రివేళ ఇవి కనిపించక ఇతర వాహనదారులు ఢీకొడుతుండడంతో రహదారులు రక్తమోడుతున్నాయి.
వందల్లో మృతులు
ఈ ఏడాది ఏడు నెలల్లో 607 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ప్రమాదాల బారిన వాటిలో అన్ని రకాల వాహనాలు ఉండగా.. 225 మంది మృతి చెందడమే కాక 526 మంది గాయపడ్డారు. ఇందులో కేవలం ద్విచక్రవాహన ప్రమాదాలు 150 ఉన్నాయని, ఈ ప్రమాదాల్లో 69 మంది మృతి చెందినట్లు నివేదికలు చెబుతున్నాయి. రోడ్డుపై వాహనదారులు వేగ నియంత్రణ పాటించకపోవడం.. ప్రధానంగా ద్విచక్ర వాహనదారుల నిర్లక్ష్యంతో ప్రమాదాలు జరుగుతున్నాయనే వాదన ఉంది.
శాఖల సమన్వయంతో..
జిల్లాలో రోడ్డు ప్రమాదాలకు కారణాలు, నియంత్రణపై పోలీస్, పంచాయతీ రాజ్, రవాణా, రెవెన్యూ, ఎన్‌హెచ్‌ఏఐ, ఆర్‌అండ్‌బీ అధికారులు సమీక్షించారు. ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గించేలా క్షేత్రస్థాయిలో సమష్టిగా కృషి చేయాలని నిర్ణయించారు. రాత్రి వేళ పోలీస్ శాఖ ఆధ్వర్యాన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేస్తూ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. మరోపక్క ఇతర శాఖలు కూడా తమ పరిధిలో చర్యలు చేపట్టారు.
అక్కడే అత్యధికంగా..
జిల్లా రోడ్డు భద్రతా కమిటీ ప్రమాదాల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించింది. ఇందులో 43 ప్రాంతాలను బ్లాక్‌స్పాట్లుగా గుర్తించారు. వీటిలో 33 ప్రాంతాలు జాతీయ రహదారులపైనే ఉండడం గమనార్హం. ఖమ్మంరూరల్ మండలంలో ఏడు, కొణిజర్ల మండలంలో ఆరు, సత్తుపల్లి, వైరా మండలాల్లో నాలుగు చొప్పున బ్లాక్‌స్పాట్లను గుర్తించారు. ఇక్కడ వేగ నియంత్రికలు, సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, జాతీయ, రాష్ట్ర, ఇతర ప్రధాన రహదారులకు గ్రామాలు, ఇతర ప్రాంతాల రోడ్లు అనుసంధానమయ్యే చోట వేగనియంత్రికలు ఏర్పాటుచేశారు. అంతేకాక హెచ్చరిక బోర్డులు, దారి మలుపులను తెలిపే సూచిక బోర్డులు, ట్రాఫిక్ సిగ్నళ్లు సైతం ఏర్పాటయ్యాయి.
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. నిత్యం డ్రంకెన్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయిస్తున్నాం. అలాగే ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో అన్ని శాఖల సమన్వయంతో హెచ్చరికల బోర్డులు ఏర్పాటుచేయించాం. ద్విచక్ర వాహనదారులే ఎక్కువగా ప్రమాదాల బారిన పడుతున్నందున హెల్మెట్ తప్పనిసరి ధరించేలా తనిఖీల్లో సూచనలు చేస్తున్నాం. అలాగే, జాతీయ రహదారులపై వెళ్లేవారు వేగనియంత్రణ పాటిస్తే ప్రమాదాల సంఖ్య తగ్గుతుంది.
– సునీల్‌దత్, పోలీసు కమిషనర్
ఈ ఏడాది ఏడు నెలల్లో 607 రోడ్డు ప్రమాదాలు