
ఈఎంటీ, కెప్టెన్ ఉద్యోగాలకు దరఖాస్తులు
ఖమ్మంవైద్యవిభాగం: ఈఎంఆర్‌ఐ 108 వాహనంలో ఎమర్జెన్సీ టెక్నీషియన్(ఈఎంటీ), 102 అమ్మ ఒడి వాహనంలో కెప్టెన్(డైవర్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు 108 ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ శివకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన పురుష అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్‌తో పాటు ఆధార్ కార్డుతో ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలోని 108 కార్యాలయంలో ఈనెల 25వ తేదీ ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు ఇంటరూవ్యలు జరుగుతాయని తెలిపారు. ఈఎంటీ పోస్టుకు బీఎస్సీ లైఫ్ సైన్స్, బీఎస్సీ నర్సింగ్, జీఎన్‌ఎం, ఏఎన్‌ఎం, బీఎస్సీ ఎంఎల్‌టీ, బీ ఫార్మసీ పూర్తిచేసిన వారు, డ్రైవర్ పోస్టుకు 10 తరగతి పాసై, 22 – 35 ఏళ్ల వయస్సు, కనీసం మూడేళ్ల అనుభవం, ఎల్‌ఎంవీ బ్యాడ్జ్ కలిగిన వారు అర్హులని వెల్లడించారు. ఇతర వివరాలకు 90102 51025, 91549 18117 నంబర్‌లను సంప్రదించాలని శివకుమార్ సూచించారు.
యుద్ధప్రాతిపదికన
పనులు పూర్తి చేయాలి
నేలకొండపల్లి/కూసుమంచి: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఎన్‌ఆర్‌ఈజీఎస్ జాయింట్ కమిషనర్ కె.కృష్ణ సూచించారు. నేలకొండపల్లి మండలం మోటాపురం, కూసుమంచి మండలం ఈశ్వరమాధారం, భగవత్‌వీడు గ్రామాల్లో పనుల జాతరలో భాగంగా శుక్రవారం పర్యటించిన ఆయన ఉపాధి నిధులతో చేపట్టే పనులను ప్రారంభించి మాట్లాడారు. ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతీ పల్లెలో రహదారులు నిర్మిస్తుండగా నాణ్యతపై ఉద్యోగులు దృష్టి సారించాలని సూచించారు. విధుల్లో ఎవ రు నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని హెచ్చరించారు. ఈకార్యక్రమాల్లో డీఆర్‌డీఓ ఏపీడీ శ్రీదేవి, ఎంపీడీఓలు ఎం.యర్రయ్య, రాంచందర్‌రావు, ఎంపీఓ శివ, ఏపీఓలు ఆర్.సునీత, అప్పారావు, ఈసీ శేషగిరిరావు పాల్గొన్నారు.
రూ.9 కోట్లతో
బీసీ హాస్టళ్లకు భవనాలు
సత్తుపల్లిటౌన్: జిల్లాలోని వి.వెంకటాయ పాలెం, ముస్తాఫనగర్ బాలుర హాస్టల్, ఖమ్మంలోని బాలికల బీసీ హాస్టళ్లకు రూ.3కోట్ల చొప్పున రూ.9 కోట్ల నిధులతో నూతన భవనాల నిర్మాణం చేపడుతున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ అభివృద్ధి అధికారి జి.జ్యోతి తెలిపారు. సత్తుపల్లిలోని బీసీ హాస్టళ్లను శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బీసీడబ్ల్యూఓ మాట్లాడుతూ పెనుబల్లి, సత్తుపల్లి, తిరుమలాయపాలెం, చిన్నకోరుకొండి హాస్టళ్లకు భవన నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదించామని తెలిపారు. హాస్టళ్లు పునఃప్రారంభమైన రోజే విద్యార్థులకు బెడ్‌షీట్లు, కార్పెట్లు, నోట్‌పుస్తకాలు అందించామన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని హాస్టళ్లలో ఎమ్మెల్యే రాగమయి చొరవతో ఫ్యాన్లు, లైట్లు, కుర్చీలు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా అన్ని కళాశాల హాస్టళ్లకు పుస్తకాలు సమకూర్చామని చెప్పారు. ఈసందర్భంగా ఆమె హాస్టళ్లలోని సరుకుల నాణ్యతను పరిశీలించారు. ఏబీసీడీఓ ఐ.గ్రీసమ్మ, వార్డెన్లు ఎం.వెంకటేశ్వర్లు, బి.హేమలత, ఎ.అశోక్‌రెడ్డి, కిరణ్ పాల్గొన్నారు.
నేటి నుంచి జాతీయ
క్రీడా దినోత్సవ పోటీలు
ఖమ్మం స్పోర్ట్స్: జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యాన శనివారం నుంచి ఈనెల 31వ తేదీ వరకు జాతీయ క్రీడా దినోత్సవంలో భాగంగా పోటీలు నిర్వహిస్తున్నట్లు డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి తెలిపారు. ఈనెల 23వ తేదీన మధిర, ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం, వైరా, కల్లూరులో అండర్–10 బాలబాలికలకు స్కేటింగ్, టేబుల్ టెన్నిస్, బాస్కెట్‌బాల్, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తారు. అలాగే, 24న అన్ని కేటగిరీల్లో పోటీలు, 25న పటేల్ స్టేడియంలో హెల్త్ క్యాంప్, 26న వెటరన్ క్రీడాకారులకు పోటీలు నిర్వహించనున్నారు. అంతేకాక 27న సాంస్కృతిక కార్యక్రమాలు, 28న క్రీడారంగంపై డిబేట్, 29న జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు, 30న ప్రేరణ తరగతులు, 31వ తేదీన సైక్లింగ్ ర్యాలీ ఉంటాయని డీవైఎస్‌ఓ తెలిపారు.

ఈఎంటీ, కెప్టెన్ ఉద్యోగాలకు దరఖాస్తులు