
సామాజిక, వ్యక్తిగత ఆస్తుల సృష్టి
● రూ.67 కోట్లతో జిల్లాలో ఉపాధి హామీ పనులు ● ‘పనుల జాతర’ ప్రారంభంలో కలెక్టర్ అనుదీప్
రఘునాథపాలెం: ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పనులతో సమాజానికే కాక వ్యక్తులకు ఉపయోగపడే ఆస్తుల సృష్టి జరగాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ‘పనుల జాతర’లో భాగంగా శుక్రవారం ఆయన రఘునాథపాలెం మండలం బూడిదంపాడులో పర్యటించారు. వంద రోజుల పనిదినాలు పూర్తి చేసిన కూలీలతో పాటు దివ్యాంగురాలు పేరం రమాదేవిని సన్మానించడమే కాక లబ్ధిదారులు అంగడాల నాగమణి, కేతినేని ద్రౌపదికి చెక్కులు అందజేశారు. అనంతరం ఉపాధి హామీ నిధులు రూ.3లక్షలతో నిర్మించిన పౌల్ట్రీ షెడ్డు, రూ.లక్షతో నిర్మించిన పశువుల షెడ్డును కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. ఈ ఏడాది జిల్లాలో రూ.67 కోట్ల వ్యయంతో ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయని తెలిపారు. గ్రామసభల తీర్మానాలతో పనులు చేపడుతున్నందున అంతా పర్యవేక్షించాలని సూచించారు. గతంలో ఈ పథకం ద్వారా పూడికతీత వంటి పనులే చేపట్టేవారని, ఇప్పుడు పౌల్ట్రీ, పశువుల షెడ్లు, తోటల పెంపకం, రహదారులు, అంగన్‌వాడీ భవనాల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. రైతులు పంటలు సాగు చేస్తూనే పశువుల పెంపకంతో అదనపు ఆదాయం పొందాలని కలెక్టర్ సూచించారు. ఈకార్యక్రమంలో డీఆర్‌డీఓ ఎన్.సన్యాసయ్య, డీఎల్‌పీఓ రాంబాబు, ఎంపీడీఓ అశోక్‌కుమార్, తహసీల్దార్ శ్వేత, ఎంపీఓ శ్రీనివాసరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ దిరిశాల చిన్న వెంకటేశ్వరరావు, మార్కెట్ డైరెక్టర్ నర్సయ్య, ఏపీఓ పద్మయ్యనాయుడు, గ్రామపంచాయతీ కార్యదర్శి నరేష్ పాల్గొన్నారు.
గ్రామీణ ప్రాంతాల కూలీలకు ఉపాధి
ఖమ్మంమయూరిసెంటర్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో భాగంగా గ్రామీణ ప్రాంత నిరుపేద కూలీ కుటుంబాల పనులు కల్పిస్తున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 60.24 లక్షల పనిదినాలు కల్పించి రూ.127.06 కోట్లను కూలీల వేతనంగా చెల్లించినట్లు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 25.85 లక్షల పనిదినాలు కల్పించి రూ.70.14 కోట్ల వేతనం చెల్లింపు పూర్తయిందని పేర్కొన్నారు. కాగా, పనుల జాతరలో భాగంగా జిల్లాలోని 571 గ్రామాలలో శుక్రవారం రూ.8.78 కోట్ల విలువైన 626 పనులను ప్రారంభించడమేకాక కొత్త పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు.