
రేపు జాబ్ మేళా
ఖమ్మం రాపర్తినగర్: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు శనివారం ఖమ్మం టేకులపల్లిలోని మోడల్ కెరీర్ సెంటర్‌లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి ఎన్.మాధవి తెలిపారు. రిలయన్స్ నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్, భారత్ హ్యూండాయ్‌లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని వెల్లడించారు. ఆసక్తి ఉన్న యువతీ, యువకులు విద్యార్హతలు, ఇతర సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో హాజరుకావాలని సూచించారు.
సీపీఎస్ ఈయూ
ఆధ్వర్యాన నేడు బ్లాక్ డే
ఖమ్మం సహకారనగర్: సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో శుక్రవారం బ్లాక్ డే నిర్వహించాలని నిర్ణయించినట్లు టీఎస్ సీపీఎస్ ఈయూ జిల్లా అధ్యక్షుడు చంద్రకంటి శశిధర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈమేరకు సీపీఎస్ ఉద్యోగులు పని ప్రదేశాల్లో భోజన విరామ సమయాన నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని కోరారు. కాగా, తమ సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి పరిష్కరిస్తారనే నమ్మకం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఖమ్మం ర్యాలీపై
కేంద్ర హోంశాఖ విచారణ
ఖమ్మం మయూరిసెంటర్(ఖమ్మంమామిళ్లగూడెం): పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడులను నిరసిస్తూ ఈనెల 5న ఖమ్మంలో నిర్వహించిన ర్యాలీపై కేంద్ర హోంశాఖ విచారణకు ఆదేశించిందని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. పాలస్తీనాకు అనుకూలంగా నిర్వహించిన ర్యాలీకి అనుమతి లేకుండా మైనర్లను పిలిపించడమే కాక, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వారితో నినాదాలు చేయించారని పేర్కొన్నారు. ఈ మేరకు తాను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు ఫిర్యాదు చేయగా కేంద్ర హోంశాఖ విచారణకు ఆదేశిందని తెలిపారు.
మెప్మా పీడీగా
నళినీ పద్మావతి
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా జి.నళినీ పద్మావతి బాధ్యతలు స్వీకరించారు. పీడీగా నియమితులైన ఆమె ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయంలోని మెప్మా కార్యాలయంలో గురువారం రిపోర్ట్ చేశారు. ఈ సందర్భంగా మెప్మా డీఎంసీ ఎస్.సుజాత, ఏడీఎంసీ, టీఎంసీ జి.సుజాత తదితరులు పీడీని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలో మెప్మా కార్యకలాపాలపై నళిని సమీక్షించారు.
అథ్లెటిక్స్ ఎంపిక
పోటీలకు 200మంది..
ఖమ్మం స్పోర్ట్స్: జిల్లాస్థాయి అథ్లెటిక్స్ జట్ల ఎంపిక పోటీలకు భారీ స్పందన లభించింది. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన గురువారం ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానంలో పోటీలు నిర్వహించారు. ఈమేరకు 124 మంది బాలురు, 76 మంది బాలికలు హాజరుకాగా, ప్రతిభ కనబరిచిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మందుల వెంకటేశ్వర్లు, ఎం.డీ.షఫీక్ అహ్మద్ తెలిపారు. ఈ జట్లు మహబూబ్‌నగర్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటాయని వెల్లడించారు. ఖమ్మం అథ్లెటిక్స్ అకాడమీ చీఫ్ కోచ్ ఎం.డి.గౌస్, అసోసియేషన్ బాధ్యులు సుధాకర్, రవి, వెంకటేశ్వర్లు, నవీద్, తిరుపతి పాల్గొన్నారు.
‘బొమ్మ’ కాలేజీకి పేటెంట్
ఖమ్మంఅర్బన్: ఖమ్మంలోని బొమ్మ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఫార్మసీ కళాశాలకు మరో పేటెంట్ లభించింది. గతంలో ఓ పేటెంట్ ఉండగా, ప్రస్తుతం కేంద్రప్రభుత్వం పరిధిలోని ‘ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ విభాగం’నుంచి ‘ఆటోమేటెడ్ న్యూరల్ నెట్‌వర్క్ బేస్డ్(ఏడీఎంఈ) ప్రెడిక్షన్ షన్ సిస్టమ్ ఎక్విప్‌మెంట్’కు రెండో పేటెంట్ మంజూరు చేశారు. ఈ సందర్భంగా గురువారం బొమ్మ కాలేజీ చైర్మన్ రాజేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలోనే రెండు పేటెంట్లు దక్కించుకున్న ఏకై క కాలేజీ తమది కావడం గర్వంగా ఉందని తెలిపారు. అనంతరం వైస్ చైర్మన్ బొమ్మ సత్యప్రసాద్, సెక్రటరీ ఉదార్ శ్రీధర్, ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ్‌భాస్కర్‌కు మాట్లాడగా అధ్యాపకులు డాక్టర్ కిరణ్ జ్యోతి, సంతోష్, సుచరిత, అక్షిత, విశ్వర్య, జ్ఞానేశ్వరరెడ్డి, యణవి, శ్రావణిరెడ్డి, నవీన్, రిక్షిత, సాంధిక పాల్గొన్నారు.

రేపు జాబ్ మేళా