
‘సీతారామ’ పూర్తికాకుండా నీళ్లు ఎలా వస్తాయి?
ఎర్రుపాలెం: సీతారామ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయకుండా వైరా నదికి జలాలు ఎలా వస్తాయి, అక్కడి నుంచి జవహర్ ఎత్తిపోతలతో మధిర, ఎర్రుపాలెం మండలాలకు ఎలా సరఫరా చేస్తారో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు సూచించారు. ఎర్రుపాలెం మండలం మీనవోలు, భీమవరంల్లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి కరపత్రాల్లో సంతకం పెట్టిన డిప్యూటీ సీఎం అమలులో చిత్తశుద్ధి చూపడం లేదని ఆరోపించారు. మహిళలకు రూ.2,500, ఇందిరమ్మ భరోసా ద్వారా కూలీలకు రూ.12 వేలలు, ఆటో కార్మికులకు రూ.12వేలు ఇస్తామన్న హామీలను విస్మరించారని తెలిపారు. అంతేకాక ఇందిరమ్మ కమిటీల పేరుతో కాంగ్రెస్ శ్రేణులకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారని విమర్శించారు. ఇక యూరియా లభించక రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కాగా, త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి పార్టీ శ్రేణులు పోటీకి సిద్ధం కావాలని సూచించారు. ఈ సమావేశాల్లో సీపీఎం నియోజకవర్గ, మండల కార్యదర్శులు మడుపల్లి గోపాలరావు, మద్దాల ప్రభాకర్‌రావు, నాయకులు దివ్వెల వీరయ్య, గొల్లపూడి కోటేశ్వరరావు, సగుర్తి సంజీవరావు, నల్లమోతు హన్మంతరావు, షేక్ లాల, దూదిగం బసవయ్య, మేడగాని తిరుపతిరావు, షేక్ నాగులమీరా తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు సుదర్శన్‌రావు