
ఎట్టకేలకు ‘సుడా’ ముసాయిదా
● కలెక్టరేట్, కేఎంసీల్లో మాస్టర్ ప్లాన్ మ్యాప్‌లు ● మండల, గ్రామ కార్యాలయాల్లో మాత్రం కరువు ● ప్లాన్ అమలు కార్యాచరణపై తలెత్తుతున్న ప్రశ్నలు
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగరం, పరిసర ప్రాంతాల భవిష్యత్‌ను నిర్దేశించే స్తంభాద్రి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(సుడా) మాస్టర్ ప్లాన్ ముసాయిదాను అధికారులు ఎట్టకేలకు విడుదల చేశారు. దీంతో 2021లో ప్రారంభమైన ప్రక్రియ ఇప్పుడు తుది రూపుకు చేరినట్లయింది. మాస్టర్ ప్లాన్ ముసాయిదాపై ప్రజల నుండి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించేందుకు మ్యాప్‌లను కలెక్టరేట్, కేఎంసీ కార్యాలయంలో ప్రదర్శించారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు ఏడు మండలాల పరిధి 45 గ్రామపంచాయతీలను కలుపుకుని అధికారులు మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రూపొందించారు.
571.83 చ.కి.మీ. విస్తీర్ణంలో..
2024 అక్టోబర్‌లో సుడా పరిధిని విస్తరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో సుడా పరిధి 571.83 చ.కి.మీ. విస్తరించి ఉండగా.. కేఎంసీతో పాటు ఏడు మండలాల పరిధిలోని 45 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఈ పరిధితోనే ప్రస్తుత మాస్టర్ ప్లాన్ ముసాయిదా రూపొందించారు. దీనిపై అధికారులు 90 రోజుల పాటు అభ్యంతరాలు, సూచనలను స్వీకరిస్తారు.
పాలకవర్గం, ఉద్యోగులు ఎక్కడ?
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అంతకుముందు ‘సుడా’కు ఉన్న పాలకవర్గాన్ని 2023 డిసెంబర్‌లోనే రద్దు చేసింది. ఆతర్వాత కొత్త పాలకవర్గాన్ని నియమించకపోగా.. ఉద్యోగుల పోస్టులు సైతం కేటాయించలేదు. కేఎంసీ కమిషనర్ సుడా వైస్ చైర్మన్‌గా ఉండడంతో కేంఎసీ ఉద్యోగులతోనే పని చేయిస్తున్నారు. ఇప్పటికే కేఎంసీ టౌన్ ప్లానింగ్‌లో ఉద్యోగుల కొరత వేధిస్తుంటే.. ఉన్న వారిపై ‘సుడా’ భారం అదనంగా పడినట్లయింది. ఈ నేపథ్యాన సుడా అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని.. తాత్కాలిక ఏర్పాట్లతో భూసేకరణ, ప్రాజెక్టుల అమలు, అభివృద్ధి జరుగుతుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
పరిశీలన, పర్యవేక్షణపై నీలినీడలు
మాస్టర్ ప్లాన్ అంటే కేవలం రోడ్లు, భవనాల నిర్మాణమే కాదు నగర జీవనానికి కీలకమైన సహజ వనరుల పరిరక్షణ కూడా తప్పనిసరి. ఖమ్మం చుట్టుపక్కల అనేక చెరువులు, డొంక రోడ్లు కబ్జాకు గురవుతున్నాయి. అయినా పట్టించుకునే వారే కరువయ్యారు. ‘సుడా’ ఉద్యోగుల కొరతతో క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలించే పరిస్థితులు లేక కబ్జాలు సర్వసాధారణమయ్యాయి. ఇక కొత్తగా అమలుచేయనున్న మాస్టర్ ప్లాన్‌లో కనీసం 30 అడుగుల రోడ్డు ఉంటేనే నిర్మాణ అనుమతులు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ ఈ విషయంలో పరిశీలించే సిబ్బంది నియామకంపై మాత్రం పురోగతి కానరాకపోవడం గమనార్హం.
ముసాయిదాపై పెదవి విరుపు
భూముల విలువ పెంపు, సంస్థకు ఆదాయాన్ని సమకూర్చడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడం, భవిష్యత్ తరాలకు సుస్థిరమైన నగరాన్ని అందించే లక్ష్యంతో మాస్టర్ ప్లాన్ ముసాయిదా రూపొందించారు. కానీ ప్లాన్ ఆ స్థాయిలో లేకపోగా.. అభ్యంతరాల స్వీకరణలోనూ పారదర్శకత పాటించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ‘సుడా’ ఏడు మండలాల పరిధిలో విస్తరించి ఉంటే ముసాయిదా మ్యాప్‌ను కేవలం కేఎంసీ, కలెక్టరేట్‌లో ఏర్పాటుచేయడం ఈ విమర్శలకు కారణమవుతోంది. మండల కేంద్రాల్లోని అన్ని కార్యాలయాల్లోనూ ప్లాన్‌ను విడుదల చేస్తే ఫలితం ఉండేదని చెబు తున్నారు. అలా చేయకపోవడంతో నామమాత్రంగానే అభ్యంతరాలు అందుతుండగా.. తుది ప్లాన్ ఎలా ఉంటుందోనన్న విమర్శలు వస్తున్నాయి.