
ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలి
చింతకాని/కొణిజర్ల: ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అక్రమాలు జరుగుతున్న గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను రద్దు చేసి అర్హులకే మంజూరు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. చింతకాని మండలం పాతర్లపాడు లో బుధవారం జరిగిన దేవసాని వీరకృష్ణ సంతాప సభలో ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ కమిటీల తీరుతో ఆర్థికంగా ఉన్న వారికే ఇళ్లు దక్కాయని ఆరోపించారు. ఈమేరకు నిరుపేదలకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం స్పందించాలన్నారు. అలాగే, కొణిజర్లలో జరిగిన సమావేశంలో నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇటీవల వర్షాలతో గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించినందున అధికారులు స్పందించాలని, యూరియా కొరత రాకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈసమావేశాల్లో సీపీఎం నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, సామినేని రామారావు, మునుకుంట్ల సుబ్బారావు, మడుపల్లి గోపాలరావు, రాచబంటి రాము, చింతపల్లి ప్రసాద్, తాళ్లపల్లి కృష్ణ, కొప్పుల కృష్ణయ్య, చెరుకుమల్లి కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు.