
గ్రానైట్ పరిశ్రమ పరిరక్షణకు ఐక్య ఉద్యమాలు
ఖమ్మంఅర్బన్: జిల్లాలో గ్రానైట్ పరిశ్రమను పరిరక్షించేలా అవసరమైతే ఐక్య ఉద్యమాలు చేపట్టాలని పలువురు సూచించారు. సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యాన మంగళవారం ఖమ్మంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ పార్టీలు, సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెంచిన రాయల్టీ, పర్మిట్, సీవరేజ్ చార్జీల ఉపసంహరణ, వైఎస్సార్ హయాంలో ఇచ్చిన 40శాతం సబ్సిడీ పునరుద్ధరణ, పెండింగ్ ఉన్న రూ.20కోట్ల సబ్సిడీ విడుదల, గ్రానైట్ ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గింపుపై చర్చించారు. ఈమేరకు సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు మాట్లాడుతూ గ్రానైట్ పరి శ్రమలో సంక్షోభాన్ని పరిష్కరించి కార్మికుల జీవనోపాధికి ఇబ్బంది ఎదురుకాకుండా చూడాలని కోరారు. జిల్లాలోనే పరిశ్రమపై ఆధారంగా ప్రత్యక్షంగా 35వేల మంది, పరోక్షంగా లక్ష మంది ఉపాధి పొందుతున్నందున రాయల్టీ పెంపు, అధిక విద్యుత్ చార్జీల సమస్య ఎదురుకాకుండా చూడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సున్నా నాగేశ్వరరావు సూచించారు. కాగా, గ్రానైట్ రంగాన్ని ఆదాయ వనరుగా కాకుండా ఉపాధి కోణంలో చూడాలని గ్రానైట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు యుగంధర్ కోరారు. ఇంకా సీపీఐ, బీఆర్‌ఎస్, మాస్‌లైన్ నాయకులు శింగు నర్సింహారావు, ఉప్పల వెంకటరమణ, గోకినేపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడగా గ్రానైట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కమర్తపు గోపాలరావుతో పాటు వివిధ పార్టీలు, అసోసియేషన్ల నాయకులు రాజారావు, మాదినేని రమేష్, బండిరమేష్, విష్ణు, కళ్యాణం వెంకటేశ్వరరావు, యర్రా శ్రీనివాస్, బోడపట్ల సుదర్శన్, జబ్బార్, తమ్మినేని కోటేశ్వరరావు, మోరంపూడి పరమేశ్వరరెడ్డి, బుగ్గవీటి శ్రీధర్, పారా నాగేశ్వరరావు, వేముల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు