
రాష్ట్రపతి అవార్డు గ్రహీత దుగ్గినేని మృతి
ఖమ్మం సహకారనగర్/మధిర: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా నాటి రాష్ట్రపతి డాక్టర్ శంకర్‌దయాళ్‌శర్మ చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఉపాధ్యాయ ఉద్యమ నేత దుగ్గినేని సత్యనారాయణరావు(94) మంగళవా రం తెల్లవారుజామున హైదరాబాద్‌లో మృతి చెందారు. మధిర మండలం ఇల్లూరుకు చెందిన ఆయన 1955లో ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించారు. మధిర ఉన్నత పాఠశాలతో పాటు ఉపాధ్యాయ శిక్షణా కేంద్రంలో విధులు నిర్వర్తించడమే కాక రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం(ఎస్‌టీయూ) జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగానూ పనిచేశారు. కాసు బ్రహ్మానందరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కరువుభత్యం కోసం 56 రోజుల పాటు జరిగిన సమ్మెకు దుగ్గినేని నేతృత్వం వహించారు. ఆయన 29 ఏళ్ల పాటు ఉపాధ్యాయుడిగా పనిచేశాక 1984లో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసి శాసనమండలికి పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. అలాగే, దుగ్గినేని చేకూరి కాశయ్యతో కలిసి ఖమ్మంలో గురుదక్షిణ ఫౌండేషన్ స్థాపించారు. అంతేకాక మధిర టీవీఎం ఉన్నత పాఠశాల వజ్రోత్సవ వేడుకలను సత్యనారాయణరావు సొంత ఖర్చులతో నిర్వహించారు. ఆయన మృతిపై మంగళవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పరిశ పుల్లయ్య, రాయల రవి, ఎస్‌టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.ప్రసాదరావు, ఎస్.కే.కరీం, గురుదక్షిణ ఫౌండేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శంకరయ్య, చావా శ్రీనివాసరావు, విశ్రాంత ఎంఈఓ దుగ్గినేని శ్రీనివాసరావు, రామానుజస్వామి తదితరులు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం ప్రకటించారు.