
వర్షం జోరు.. ఫుల్లు నీరు!
నీటి నిల్వకు ప్రయత్నించండి...
అలుగు పోస్తున్న
70 శాతానికి పైగా చెరువులు
ప్రాజెక్టుల్లోనూ పెరిగిన నీటి నిల్వలు
ఖమ్మంఅర్బన్: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని చెరువులు, చిన్నాపెద్దా ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. జిల్లాలో కురుస్తున్న వర్షానికి తోడు ఎగువ నుంచి వరద వచ్చి చేరడంతో 70 శాతానికి పైగా చెరువులు అలుగు పోస్తున్నాయి. సాగర్ ఆయకట్టు పరిధిలోని 17మండలాల్లో చెరువులన్నీ దాదాపు అలుగులు పారుతున్నాయని అధికారులు చెబుతున్నారు. మిగిలిన మండలాల్లోనూ పరిస్థితి ఆశాజనకంగా ఉండగా.. వానా కాలం పంటల సాగుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రాజెక్టులు ఇలా...
కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్ గరిష్ట స్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా, ప్రస్తుతం 22.20 అడుగులుగా నమోదైంది. ఇందులో 2.558 టీఎంసీల సామర్థ్యానికి గాను 2.413 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇక వైరా ప్రాజెక్టు 2.523 టీఎంసీల సామర్థ్యానికి గాను పూర్తిగా నిండి నీటిమట్టం 18.11 అడుగులుగా నమోదైంది. అలాగే, లంకాసాగర్‌లో 16 అడుగుల నీటిమట్టానికి గాను 15 అడుగుల మేర నీరు చేరగా.. 0.664 టీఎంసీల సామర్థ్యంలో 0.601 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
గణనీయంగా ప్రవాహం
ఆకేరు, మున్నేటి వాగుల్లోనూ ప్రవాహం గణ నీయంగా కొనసాగుతోంది. ఆకేరుకు 6,700 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, తీర్థాల వద్ద 8,400–8,900 క్యూసెక్కుల వరకు నీరు ప్రవహిస్తోంది. ఇక మున్నేరు ఆక్వాడెక్ట్ వద్ద 6,200 క్యూసెక్కులు, పోలిశెట్టిగూడెం వద్ద 12,700 క్యూసెక్కులు, ఖమ్మం వద్ద మున్నేరు–ఆకేరు కలిసే ప్రదేశంలో 27,957 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. కాగా, మున్నేరు, ఆకేరులో వరద ప్రవాహం స్థిరంగానే ఉన్నప్పటికీ జల వనరుల శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
అలుగు స్థాయికి చెరువులు
జిల్లాలోని మొత్తం 1,061 చెరువులకు గాను 70 శాతం పైగా చెరువుల్లోకి 75నుంచి 100శాతం నీరు చేరింది. ఇందులో 347 చెరువులు పూర్తిగా నిండి అలుగు పోస్తున్నాయి. 0–25 శాతం వరకు 38, 25–50శాతం 94, 50–75శాతం 132, 75–90శాతం 190, 90–100 శాతం మేర నీరు 260 చెరువుల్లోకి చేరిందని అధికారులు వెల్లడించారు.
వర్షాలు సమృద్ధిగా కురుస్తున్న నేపథ్యాన నీరు వృథా కాకుండా సాధ్యమైనంత మేర చెరువులు, చెక్ డ్యాంలకు మళ్లించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. హైదరాబాద్ నుంచి వీసీ ద్వారా ఇంజనీర్లతో సమీక్షించిన ఆయన వరద పరిస్థితి, చెరువులు, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలపై ఆరా తీయడమే కాక నిల్వలపై సూచనలు చేశారు.