
లబ్ధిదారుల సమక్షాన పాడి పశువుల ఎంపిక
● ప్రతీ పశువుకు బీమా, జియో ట్యాగ్ ● అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ
ఖమ్మంమయూరిసెంటర్: మధిర నియోజకవర్గంలో ఇందిరా మహిళా డెయిరీ ఏర్పాటులో భాగంగా పాడి పశువుల కొనుగోలులో నిబంధనలు పాటించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఆదేశించారు. కలెక్టరేట్‌లో అధికారులతో మంగళవారం సమీక్షించిన ఆమె ఒక్కో లబ్ధిదారుకు రెండేసి పాడి పశువులు పంపిణీ చేసేలా కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. ఇక్కడి వాతావరణంలో ఇమిడే పశువులను లబ్ధిదారుల ఆమోదంతో కొనుగోలు చేయాలని, ఆపై బీమా తప్పక చేయించడమే కాక ప్రతీ పాడి పశువుకు జియో ట్యాగ్ వేయాలని సూచించారు. వచ్చే శుక్రవారం నుంచి కొనుగోలు ప్రక్రియ మొదలుపెట్టాలని ఆమె తెలిపారు. డీఆర్‌డీఓ సన్యాసయ్య, ఎస్సీ డీడీ కస్తాల సత్యనారాయణ, గిరిజన సంక్షేమ శాఖ అధికారిణి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కోడిగుడ్ల సరఫరాకు టెండర్లు
జిల్లాలోని గురుకుల విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరా కోసం మూడు టెండర్లు దాఖలయ్యాయని అదనపు కలెక్టర్ శ్రీజ తెలిపారు. కలెక్టరేట్‌లో టెండర్లను పరిశీలించాక ఆమె మాట్లాడారు. మూడు సంస్థల బాధ్యులు ఒక్కో గుడ్డుకు రూ.5.99, రూ.6.27, రూ.6.66కు కోట్ చేశారని, నిబంధనలు పాటిస్తూ తక్కువ ధరతో సరఫరా చేసే వారికి టెండరు ఖరారు చేస్తామని తెలిపారు. సాంఘిక సంక్షేమం, బీసీ, మైనార్టీ, గిరిజన సంక్షేమ శాఖల డీడీలు కస్తాల సత్యనారాయణ, జి.జ్యోతి, డాక్టర్ బి.పురంధర్, ఎన్.విజయలక్ష్మి, డీఈఓ కె.నాగపద్మజ, డీడబ్ల్యూఓ కె.రాంగోపాల్‌రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి ఎం.ఏ.అలీమ్ పాల్గొన్నారు.
కట్టుదిట్టంగా ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు నమోదు
ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును ఎఫ్‌ఆర్‌ఎస్(ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్) ద్వారా కట్టుదిట్టంగా నమోదు చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. కలెక్టరేట్‌లో ఆమె హాజరు నమోదుపై సమీక్షించారు. విద్యాశాఖకు వచ్చే నిధుల వినియోగం, పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ, భవిత కేంద్రాల మరమ్మతులపై సూచనలు చేశాక అదనపు కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థుల గైర్హాజరుకు కారణాలు ఆరా తీయాలని, ఉపాధ్యాయులకు సెలవుల మంజూరులో ప్రణాళికాయుతంగా వ్యవహరించాలని సూచించారు. విద్యార్థులకు ఆగస్టు చివరి నాటికి అపార్ నంబర్ కేటాయించాలని తెలిపారు. డీఈఓ నాగపద్మజ, కోఆర్డినేటర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
గ్రంథాలయాల నిర్వహణకు పటిష్ట చర్యలు
ఖమ్మంగాంధీచౌక్: గ్రంథాలయాల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. గ్రంథాలయ సంస్థ సర్వసభ్య సమావేశం కలెక్టరేట్‌లో జరగగా ఆమె మాట్లాడారు. నేలకొండపల్లిలో నూతన భవన నిర్మాణం పూర్తయ్యేలా రూ.22.60లక్షలు, జిల్లా కేంద్రంలో అదనపు భవన నిర్మాణానికి ఈ ఏడాది రూ.1.50కోట్ల కేటాయింపు, పోటీ పరీక్షల పుస్తకాల కొనుగోలు తదితర అంశాలపై చర్చించారు. గ్రంథాలయ కార్యదర్శి కె.కరుణ, వయోజన విద్య డీడీ అనిల్, డీఈఓ నాగపద్మజ, డీపీఓ ఆశాలత, ఏపీఆర్‌ఓ అయూబ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.