
లక్ష్యం మేర వన మహోత్సవం
సీజనల్ వ్యాధుల వ్యాప్తిపై అప్రమత్తత
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మంమయూరిసెంటర్: వనమహోత్సవం కింద శాఖల వారీగా కేటాయించిన లక్ష్యాల మేరకు నెలాఖరు లోగా మొక్కలు నాటాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి మంగళవారం ఆయన వనమహోత్సవం, సీజనల్ వ్యాధుల కట్టడి, ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి, ఇందిరా గిరి జలవికాసం, జల్ జీవన్ మిషన్, ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 35.32లక్షల మొక్కలకు గాను 25.71 లక్షల మొక్కలు నాటినందున మిగతావీ పూర్తిచేయాలన్నారు. అలాగే, సీజనల్ వ్యాధుల కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇక 16,474 ఇందిరమ్మ ఇళ్లలో 12వేలకు మార్కింగ్ పూర్తయినందున నిర్మాణంలో వేగం పెరిగేలా పర్యవేక్షించాలని తెలిపారు. సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు ప్రభుత్వ కార్యాలయాల నుంచి ప్రతిపాదనలు సేకరించాలని సూచించిన కలెక్టర్... పారిశుద్ధ్య పనులపై చర్చించారు. అలాగే, ఇందిరా గిరి జల వికాసం ద్వారా పోడు పట్టా కలిగిన రైతుల పొలాల్లో సోలార్ పంప్‌సెట్ల ద్వారా మోటార్ అమరిస్తే జిల్లాలో 11,786 మందికి లబ్ధి జరుగుతుందని తెలిపారు. ఆతర్వాత నీటి సరఫరా, హాస్టళ్లలో టాయిలెట్ల నిర్మాణం తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఆర్‌డీఓ సన్యాసయ్య, డీఎంహెచ్‌ఓ కళావతిబాయి, డీపీఓ ఆశాలత, ట్రాన్స్‌కో, పీఆర్, పబ్లిక్ హెల్త్ ఎస్‌ఈలు శ్రీనివాసాచారి, శేఖర్‌రెడ్డి, రంజిత్, హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, గిరిజన సంక్షేమ శాఖ డీడీ విజయలక్ష్మి, మున్సిపల్ ఈఈ కృష్ణలాల్, ఐటీడీఏ ఏపీఓ డేవిడ్‌రాజ్ పాల్గొన్నారు.